ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్ పతకాల వేట శుక్రవారం కూడా కొనసాగింది. పురుషుల హైజంప్‌లో భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పసిడి పతకం సాధించాడు. దీంతో పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 26కు చేరింది. భారత్ ఇప్పటి వరకు ఆరు స్వర్ణాలు, 9 రజతాలు మరో 11 కాంస్య పతకాలను సాధించింది. కాగా, శుక్రవారం జరిగిన టి64 హైజంప్ విభాగం పోటీల్లో ప్రవీణ్ 2.08 ఎత్తు జంప్ చేసి పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో ఇదే అత్యుత్తమ హైజంప్ రికార్డు కావడం విశేషం. కాగా, పారాలింపిక్స్‌లో ప్రవీణ్‌కు ఇది వరుసగా రెండో పతకం. గతంలో టోక్యో ఒలింపిక్స్‌లో ప్రవీణ్ రజతం సాధించాడు. ఈసారి మరింత మెరుగైన ప్రదర్శనతో ఏకంగా పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇదే సమయంలో అతిచిన్న వయసులో పారాలింపిక్స్ స్వర్ణం సాధించిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు.
ఇక పారాలింపిక్స్ హైజంప్ పోటీల్లో పసిడి పతకం సాధించిన రెండో భారత అథ్లెట్‌గాకూడా ప్రవీణ్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు మరియప్పన్ తంగవేలు హైజంప్ విభాగంలో స్వర్ణం సాధించాడు. ఇదిలావుండగా పారిస్ పారాలింపిక్స్ హైజంప్ విభాగంలో భారత్‌కు ఇప్పటి వరకు మూడు పతకాలు లభించాయి. శరద్ కుమార్ రజతం సాధించగా, మరియప్పన్ కాంస్యం గెలుచుకున్నాడు. నోయిడాకు చెందిన ప్రవీణ్ కుమార్‌కు పుట్టుకతోనే కాలి వైకల్యం ఉంది. ఓ కాలు చిన్నగా ఉండటంతో చిన్నప్పుడూ ఎన్నో అవమానాలు భరించాల్సి వచ్చింది. చాలా ఏళ్ల వరకు ఆత్మన్యూనతా భావంతో బాధపడేవాడు. దాన్ని పోగొట్టుకునేందుకు క్రీడల వైపు మొగ్గాడు. ఆరంభంలో వాలీబాల్ ఎక్కువగా ఆడేవాడు. ఆ తర్వాత అథ్లెటిక్స్ కోచ్ సత్యపాల్ సింగ్ సూచన మేరకు హైజంప్ వైపు మళ్లాడు. సత్యపాల్ సింగ్ ప్రవీణ్ మేటి అథ్లెట్‌గా తీర్చిదిద్దారు. సత్యపాల్ శిక్షణలో రాటుదేలిన ప్రవీణ్ చిన్న వయసులో రెండు పారాలింపిక్స్ పతకాలు సాధించి సత్తా చాటాడు.