Sunday, November 24, 2024

ఎంఎల్ఏల వేటుపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు నెల గడువు విధించిన హైకోర్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇతర పార్టీల్లోకి ఫిరాయించిన ఎంఎల్ఏ లపై నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ స్పీకర్‌కు తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 9వ తేదీ సోమవారం నాడు నాలుగు వారాల గడువు ఇచ్చింది. బిఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఎంఎల్ఏ లపై అనర్హత వేటు వేయడంలో తెలంగాణ శాసనసభ స్పీకర్‌ చర్యలు తీసుకోకపోవడంపై బిఆర్‌ఎస్‌, బిజెపి ఎంఎల్ఏ లు వేసిన మూడు పిటిషన్‌లపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

బిఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఖైరతాబాద్‌ ఎంఎల్ఏ దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ బిజెపి నిర్మల్‌ ఎంఎల్ఏ ఆలేటి మహేశ్వర్‌రెడ్డి, హుజూరాబాద్‌ బిఆర్‌ఎస్‌ ఎంఎల్ఏ పాడి కౌశిక్‌ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన బిఆర్‌ఎస్‌ మాజీ ఎంఎల్ఏ లు, భద్రాద్రి కొత్తగూడెం ఎంఎల్ఏ వెంకటరావు తెల్లం, ఘన్‌పూర్‌ (ఎస్సీ రిజర్వ్ డ్‌) ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ కూన పాండు వివేకానంద పిటిషన్‌ దాఖలు చేశారు.

హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్వాగతించారు, కోర్టు తీర్పును “కాంగ్రెస్‌కు చెంపదెబ్బ”అని అభివర్ణించారు. ‘‘ ఫిరాయింపు ఎంఎల్ఏ లపై అనర్హత వేటుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఈ తీర్పు కాంగ్రెస్ అప్రజాస్వామిక పద్ధతులకు గణనీయమైన ఎదురుదెబ్బ. పార్టీ మారిన వారు అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని ఇది స్పష్టంగా తెలియజేస్తోంది’’ అని హరీశ్ రావు పేర్కొన్నారు. పార్టీ విజయంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ఫిరాయింపు ఎంఎల్ఏ ల నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు అనివార్యమని కూడా ఆయన అన్నారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News