ఆర్‌జి కార్ ఆసుపత్రిలో గత నెల ఒక ట్రెయినీ డాక్టర్ హత్యాచార ఘటనపై ప్రజల ఆందోళన వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ఆరోపించారు. ఈ కుట్రలో కొన్ని వామపక్షాల ప్రమేయం కూడా ఉందని ఆమె ఆరోపించారు. రాష్ట్ర సచివాలయంలో నబన్నలో ఒక పాలనాపర సమీక్షా సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ మృతురాలి తల్లిదండ్రులకు తాను డబ్బు ఇవ్వచూపినట్లు చేస్తున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. మరణించిన ట్రెయినీ డాక్టర్ కుటుంబ సభ్యులకు తాను ఎన్నడూ డబ్బు ఇస్తానని చెప్పలేదని ఆమె తెలిపారు. ఇది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. తమ కుమార్తె స్మృత్యర్థం ఏదైనా చేయాలని మీరు ఆశిస్తే దానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మాత్రమే తాను వారికి చెప్పానని ఆమె వివరించారు.
ఎప్పుడు ఏం మాట్లాడాలో తనకు తెలుసునని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఆర్‌జి కార్ ఆసుపత్రి ఘటన అనంతరం జరుగుతున్న నిరసన కచ్ఛితంగా కేంద్రం పన్నిన కుట్రేనని, ఇందులో కొన్ని వామపక్షాలకు కూడా భాగస్వామ్యం ఉందని మమత ఆరోపించారు. పొరుగుదేశంలో ఏర్పడిన సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, కాని భారత్, బంగ్లాదేశ్ రెండు వేర్వేరు దేశాలన్న విషయాన్ని వారు మరచిపోతున్నారని ఆమె అన్నారు. తన ప్రభుత్వ హోం శాఖ పనితీరును ఆమె సమర్ధించుకున్నారు. నిరసనల దరిమిలా తన పదవికి రాజీనామా చేయడానికి నగర పోలీసు కమిషనర్ వినీత్ గోయల్ సిద్ధపడ్డారని, దుర్గా పూజ త్వరలో జరగనున్న నేపథ్యంలో శాంతి భద్రతల గురించి క్షుణ్ణంగా తెలిసినవారు అవసరమని మమత తెలిపారు. సాధ్యమైనంత త్వరగా తిరిగి విధులలో చేరాలని నిరసన కొనసాగిస్తున్న జూనియర్ డాక్టర్లకు ఆమె విజ్ఞప్తి చేశారు.