Monday, November 25, 2024

ముస్లింలపై ఎందుకంత ఆగ్రహం?

- Advertisement -
- Advertisement -

ముస్లింలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ బాహాటంగా ముస్లింలను తూర్పారబట్టడం అనేక మందిని, ముఖ్యంగా ప్రజాస్వామిక, సెక్యులర్ భావాలు గల వ్యక్తులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. అధికార బిజెపికి ప్రముఖ ప్రచారకర్త, ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత ప్రియతమ ముఖ్యమంత్రుల్లో ఒకడైన హిమంత బిశ్వశర్మ అస్సాంలో సమస్యలన్నింటికీ ముస్లింలే కారకులని ఆరోపిస్తున్నారు. గౌహతి నగరంలో వరదలు, బాల్య వివాహాలు, బహు భార్యత్వం, నిరుద్యోగిత, మాదకద్రవ్యాల వినియోగం, వేగంగా జనాభా పెరుగుదల, ఇతర నేరాలతో సహా అన్ని సమస్యలకు ముస్లింలదే బాధ్యత అని ఆయన ఆరోపిస్తున్నారు. ఇటీవల ముగిసిన అస్సాం శాసనసభ సమావేశాల్లో ఆయన ముస్లింలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఆయన వారిని మియాలుగా పేర్కొంటూ, అస్సాంపై ఆధిపత్యానికి ముస్లింలను తాను అనుమతించబోనని స్పష్టం చేశారు. శాసనసభలో శుక్రవారం ప్రార్థనల కోసం రెండు గంటల విరామాన్ని రద్దు చేసే తీర్మానాన్ని అస్సాం శాసనసభ ఆమోదించింది. ఆ విరామం వలసవాద విధానం అని, అందువల్ల దానిని రద్దు చేశామని శర్మ చెప్పారు. దీని తరువాత పని గంటలు పెరుగుతాయని, మరింతగా పని జరుగుతుందని ఆయన తెలిపారు. అయితే, బిజెపి మిత్రపక్షాలు, ఫెడరల్ ప్రభుత్వంలో భాగస్వామ్యపక్షాలైన జనతాదళ్ (యునైటెడ్) (జెడియు), లోక్ జన్‌శక్తి పార్టీ (ఎల్‌జెపి) కూడా ముఖ్యమంత్రి శర్మను విమర్శించవలసి వచ్చింది. శాసనసభలో శుక్రవారం ప్రార్థనల కోసం రెండు గంటల విరామం రద్దుకు శర్మ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అవి తూర్పారబట్టాయి.

అస్సాంలో బెంగాలీ మాట్లాడే ముస్లిం కార్మికులపై దౌర్జన్యం, బెదిరింపు ఆరోపణలకు సంబంధించి తూర్పు అస్సాం చరాయిదేవ్ జిల్లాకు చెందిన బిజెపి నాయకుడు మయూర్ బోర్గోహెయిన్‌పై ఆగస్టు 26న ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. పశ్చిమ అస్సాంలోని బార్పేట జిల్లాకు చెందిన ఆ కార్మికులను చరాయిదేవ్‌లో ఒక నైపుణ్య అభివృద్ధి కేంద్రం నిర్మాణం నిమిత్తం బోర్గోహెయిన్ నియమించుకున్నారు. తాము పదే పదే గుర్తు చేసినప్పటికీ రూ. 15 లక్షల మేరకు వేతన బకాయిలను బోర్గోహెయిన్ చెల్లించలేదని కార్మికులు ఆరోపించారు. అస్సాం ముఖ్యమంత్రి వివాదాస్పద కాంట్రాక్టర్, బిజెపి నేత మయూర్ బోర్గోహెయిన్‌కు దన్నుగా నిలిచి, బెంగాలీ మాట్లాడే మియా ముస్లింలను పని కోసం ఎగువ అస్సాంకు రానివ్వబోమని బెదరించారు. నాగావ్ ధింగ్‌లో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన విషాద ఘటన తరువాత అస్సాంలో ప్రతిచోటా హిందూ అస్సామీయులు ‘ముస్లిం కుట్ర, దురుద్దేశాలబారిన పడుతున్నార’ని విమర్శించారు.

ఆ నిందితులు ముగ్గురిలో ఒకరు ముస్లిం కాగా, మరి ఇద్దరి పేర్లను పోలీసులు వెల్లడించలేదు. 2024 మే నుంచి మహిళలు, కొన్ని ఇతర వర్గాలపై పెరుగుతున్న నేరాలకు ముస్లింలే కారకులని బిశ్వశర్మ ఆరోపించారు. బిజెపి నేతలు, ముఖ్యంగా అస్సాం ముఖ్యమంత్రి స్వయంగా ముస్లింలకు వ్యతిరేకంగా సాగిస్తున్న ఈ ప్రచారం పర్యవసానంగా రాష్ట్రంలో ముస్లింలకు వ్యతిరేకంగా సెంటిమెంట్లు పెరుగుతున్నాయి. పైన పేర్కొన్న సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు తఫికుల్ ఇస్లాం అలియాస్ తఫజ్జుల్ పోలీస్ కస్టడీలో మరణించడం మిస్టరీగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో పోలీస్ ఎన్‌కౌంటర్లలో మరణాలు, కస్టడీలలో మరణాలు పెరుగుతున్నాయి. అటువంటి ఎన్‌కౌంటర్లలో మృతులు చాలామంది ముస్లిం యువకులే.

అస్సాం ముఖ్యమంత్రి ముస్లింలను రాక్షసులుగా చిత్రించే యత్నం చేస్తుండడమే కాకుండా ముస్లింలపై విమర్శలు, బెదిరింపులకు మొత్తం రాష్ట్ర శాసనసభను ఉపయోగించుకున్నారు. ముస్లింలకు శుక్రవారం రెండు గంటల విరామాన్ని రద్దు చేయడంతో పాటు అస్సాం శాసనసభ ఆగస్టు 28న అస్సాం ముస్లిం వివాహాలు, విడాకుల నిర్బంధ నమోదు బిల్లు 2014ను ఆమోదించింది. ఆ ప్రతిపాదిత చట్టం లక్షాలు ‘బాల్య వివాహాలు’, ‘వ్యక్తుల సమ్మతి లేని వివాహాల’ నివారణ. ‘బహు భార్యత్వం కట్టడి’. ఖాజీలు ముస్లింల వివాహాలను రిజిస్టర్ చేయడానికి ఉపయోగించే 1935 నాటి అస్సాం ముస్లిం వివాహాలు, విడాకుల చట్టాన్ని రద్దు చేసింది. ఇక మీదట ముస్లిం వివాహాలు అన్నిటినీ జిల్లా వివాహ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే రిజిస్టర్ చేయవలసి ఉంటుంది.

వివిధ మతవర్గాలకు చెందిన భారత పౌరులు అందరి వివాహాలను వారి వారి రాష్ట్రాల్లోని వివాహ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలని సుప్రీం కోర్టు 2006లో సీమా వెర్సస్ అశ్వినీ కుమార్ కేసులో రాష్ట్రాలను, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనేక రాష్ట్రాలు ఆ తరువాత అన్నిరకాల వివాహాలను తప్పనిసరిగా రిజిస్టర్ చేసేందుకు బిల్లును ఆమోదించాయి. మతంతో నిమిత్తం లేకుండా అన్ని వివాహాల తప్పనిసరి రిజిస్ట్రేషన్ కోసం సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఒక చట్టాన్ని చేయడానికి బదులు అస్సాం ప్రభుత్వం ఆశ్చర్యకరంగా కొత్త చట్టం చేయడం ద్వారా అన్ని ముస్లిం వివాహాలను ప్రాధికార సంస్థతో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ జరిగేలా చేసింది. రాష్ట్ర ప్రభుత్వం హిందువులతో సహా ఇతరులను అటువంటి చట్టం పరిధిలో నుంచి మినహాయించింది. ఇప్పుడు ముస్లింలు మినహా హిందువులు, ఇతర మతవర్గాలు అస్సాంలో పౌర అధికారుల రిజిస్ట్రేషన్ లేకుండా వివాహాలు జరిపించుకోవచ్చు.

విలేకరుల గోష్ఠిలో తనను ఒక కీలక ప్రశ్న వేసిన జర్నలిస్ట్ పేరును అస్సాం ముఖ్యమంత్రి అడిగారు. ఆ జర్నలిస్ట్ ఒక ముస్లిం అని తెలిసిన మీదట అతనిని ముస్లింలు అస్సాంలో జీవించనిస్తారా అంటూ ముఖ్యమంత్రి కేకలు వేయసాగారు. అస్సాం సరిహద్దులో మేఘాలయలో ఒక కొండపై నిర్మించిన మేఘాలయ సైన్స్, టెక్నాలజీ విశ్వవిద్యాలయం (యుఎస్‌టిఎం)పై బిశ్వశర్మ విరుచుకుపడ్డారు. ఆ ప్రైవేట్ విశ్వవిద్యాలయం చాన్సలర్, యజమాని మహబూబుల్ హక్.. బెంగాలీ మాట్లాడే ఒక అస్సామీ. విశ్వవిద్యాలయం నిర్మాణంకోసం కొండను కొట్టివేసినందున అది అస్సాంలో వరదలకు కారణమైందని అస్సాం ముఖ్యమంత్రి ఆరోపించారు. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ముందు నుంచే గౌహతిలో వరదలు సంభవిస్తున్నాయి. ఆ విశ్వవిద్యాలయాన్ని విద్యలో అత్యుత్తమ విశిష్టతకు సంబంధిత అధికారులు పెద్ద ర్యాంకు ఇచ్చినప్పటికీ అక్కడ ఉత్తీర్ణులైన విద్యార్థులు అస్సాంలో ఏ ప్రభుత్వోద్యోగాన్నీ పొందబోరని కూడా శర్మ చెప్పారు.

ముస్లింలపై పరుష పదజాలంతో విమర్శలు చేయడంలో యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు బిజెపి సీనియర్ నేతలను హిమంత బిశ్వశర్మ మించిపోయారు. యోగికి చైనీస్ వెర్షన్ శర్మ అని ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్ చేసిన వ్యాఖ్య బిజెపిని ఆగ్రహానికి గురి చేసింది. అయితే, శర్మ ప్రధాని మోడీ స్ఫూర్తితోనే పైకి వచ్చారు. హ్యూమన్ రైట్స్ వాచ్ (హెచ్‌ఆర్‌డబ్లు) ఆయన ప్రసంగాలను విశ్లేషించి, ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసిసి) అమలులో ఉండగా మోడీ చేసిన 173 ప్రసంగాల్లో 110 ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలతో కూడుకున్నవని నివేదించింది. వార్తాపత్రికలు, టివి చానెళ్లు, డిజిటల్ మీడియా దానిని ప్రచారం చేస్తున్నాయి. ఇది సమ్మతనీయం కాదని చాలా కొద్ది మంది అన్నారు. అటువంటి విద్వేష ప్రసంగాలు ముస్లింలపై దౌర్జన్య సంఘటనలకు దారి తీశాయి. అటువంటి విద్వేష ప్రసంగాలు, ముఖ్యంగా బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు చేసినవి విపరిణామాలకు దారి తీస్తుంటాయన్నది గమనార్హం.

మెజారిటీ వర్గాన్ని ఆకట్టుకోవడానికే ముస్లింలను అస్సాం ముఖ్యమంత్రి లక్ష్యం చేసుకుంటున్నారు. అస్సాం రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరిగేది 2026 ప్రథమార్ధంలోనే. మతపరంగా విభజిత రాజకీయాలతో మినహా ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇతర అభివృద్ధి సంబంధిత అంశాలు, ప్రజా సంబంధిత అంశాలు అస్సాం ముఖ్యమంత్రికి, రాష్ట్ర బిజెపికి లేవు. తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలకు జనాదరణ పెరుగుతున్నదన్నది ఆయనకు తెలుసు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేక వైఖరి అస్సాంలో గత పార్లమెంటరీ ఎన్నికల్లో తేటతెల్లమైంది. అత్యంత తీవ్రస్థాయిలో కటువైన రాజకీయ వ్యాఖ్యలు ఆయన ప్రతిష్ఠను, ప్రభుత్వ ప్రతిష్ఠను శాంతి కాముకులైన, ప్రజాస్వామ్యప్రియులైన ప్రజల దృష్టిలో దెబ్బ తీశాయి.

గీతార్థ పాఠక్

(రచయిత సీనియర్ జర్నలిస్టు, ఈశాన్య రాష్ట్రాల రాజకీయ, సామాజిక అంశాల విశ్లేషకుడు)

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News