Thursday, September 19, 2024

నిబంధనల ప్రకారమే పీఏసీ చైర్మన్ నియామకం: శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని తెలంగాణ ఐటి శాఖ మంత్రి దుద్దిళ శ్రీధర్ బాబు అన్నారు. శాసనసభ నిబంధనల ప్రకారమే పీఏసీ ఛైర్మన్‌ను స్పీకర్ నియమించారని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీపై శ్రీధర్ బాబు విమర్శలు గుప్పించారు. ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్‌గా అరికెపూడి గాంధీ నియామకంపై బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలను మంత్రి తిప్పికొట్టారు. తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేను అని పీఏసీ ఛైర్మన్ స్వయంగా చెప్పారని అన్నారు. బీఆర్‌ఎస్ నేతలతో పీఏసీ ఛైర్మన్‌కు అభిప్రాయభేదాలుంటే తమకేం సంబంధమని శ్రీధర్ బాబు అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ నిబంధనలు, సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీ స్పీకర్ ,శాసనమండలి ఛైర్మన్‌లు సభను నిర్వహిస్తారని, వారిని అవమానించేలా ప్రతిపక్షాలు మాట్లాడటం సరైనది కాదన్నారు.

వ్యక్తులపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ వ్యవస్థను గౌరవించాల్సిందేనని, సభాపతి ఒక ప్రక్రియ ప్రకారం అసెంబ్లీ కమిటీలను ఏర్పా టు చేస్తారని చెప్పారు. అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ఎవరూ మాట్లాడడానికి లేదని, గతంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందెవరని ప్రశ్నించారు. జీరో ఎంపీ సీట్లు ఇచ్చినా బీఆర్‌ఎస్ నేతల వైఖరి మారలేదని శ్రీధర్ బాబు ఆక్షేపించారు. ఫలితాల తర్వాత కూడా ఏదో జరుగుతుందని బీఆర్‌ఎస్ నేతలు కొన్ని రోజులు తిరిగారన్న శ్రీధర్ బాబు అంత తిరిగిన తర్వాత కూడా ప్రజలు మరోసారి తీర్పు ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వాన్ని నడపాలని ప్ర జలు తమకు తీర్పు ఇచ్చారని వెల్లడించారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యవ్యవస్థలను కాలరాసిందని, కూల్చివేసిందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను తారుమారు చేసి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న భట్టి విక్రమార్కను ఇబ్బంది పెట్టారని, బీఆర్‌ఎస్ హయాంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు కాకుండా పీఏసీ పదవి ఎవరికి ఇచ్చారో అందరూ చూశారని, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు బీఆర్‌ఎస్ నేతల తీరు ఉందని శ్రీధర్ బాబు అన్నారు. ప్రజలు, సమాజం కోరుకునే విధంగా తమ ప్రభుత్వ పాలన ఉంటుందని వెల్లడించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News