పూటకో పార్టీ మార్చే దానం నాగేందర్ బిచ్చగాడు…చీటర్ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలంటూ కేపీ వివేకానందతో కలిసి ఆయన అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులను కలిశారు. అనంతరం మాట్లాడుతూ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఉపఎన్నికలు వస్తాయని భయపడిపోతున్నారన్నారు. తీర్పును అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల సమయం ఇచ్చిందని గుర్తు చేశారు. చర్యలు తీసుకోకుంటే సుమోటోగా కేసు స్వీకరిస్తామని హైకోర్టు చెప్పిన విషయాన్ని నరసింహాచార్యులకు వివరించారు. ఆలస్యం చేయకుండా తక్షణమే వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఏమాత్రం సిగ్గులేదని కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి పచ్చి మోసగాడు…కేసీఆర్ వద్ద ఉదయం పూట బ్యాగులు తీసుకుని సాయంత్రానికల్లా కాంగ్రెస్‌లో చేరారని ఆరోపించారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో శ్రీహరి కనీసం డిపాజిట్ తెచ్చుకొని చూపించాలని సవాల్ చేశారు. కాంగ్రెస్‌లో చేరినట్లు స్వయంగా చెప్పిన అరికెపూడి గాంధీ ఇప్పుడు మాట మార్చడం విడ్డూరమన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ నిర్ణయం వెలువరించేదాకా ఆగకుండా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. అరికెపూడి గాంధీ బీఆర్‌ఎస్ పార్టీ సభ్యులైతే తెలంగాణ భవన్‌కు రావాలని లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గతంలో విడివిడిగా ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని నిరూపిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానన్నారు. తమ హయాంలో సీఎల్పీ బీఆర్‌ఎస్ పార్టీలో విలీనమైందన్నారు.