Sunday, December 22, 2024

ప్రజాపాలనకు కోవర్ట్‌ల గ్రహణం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్ : తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నందున కేసీఆర్‌ను కాదని కాంగ్రెస్‌కు పట్టం కట్టారు.ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి ప్రజల మనోభావాలకు అనుగుణంగా పరిపాలించాలని ప్రయత్నిస్తున్నారు కానీ, కొందరు బిఆర్‌ఎస్ అనుకూల,‘కోవర్టు’ ఐఏఎస్ అధికారులు ఆయనను ’తప్పుదోవ’ పట్టిస్తున్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కొన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేసే కీలక అధికారులు, సిబ్బంది ఇప్పటికీ కేసీఆర్ కు పరోక్షంగా భజన చేస్తున్నట్టు తెలియవచ్చింది.అలాంటి వారి ‘ఏరివేత’ జరగకపోతే నష్టం జరగవచ్చుననే అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది.ప్రభుత్వం మారినట్టుగాప్రజల్లో బలం గా రిజిస్టర్ కావడం లేదని పలువురు ప్రభుత్వ ఉ ద్యోగులు చెబుతున్నారు. ఇందుకు కారణం పాలనలో ఇంకా ’కేసీఆర్ వాసనలు’ పూర్తిగా తొలగకపోకపోవడం, కొందరు ఐ ఏఎస్ సీనియర్లు బిఆర్‌ఎస్‌కు‘అనుకూలం’గా పని చేస్తుండటమే. తక్షణం సీఎం రేవంత్ శాఖలవారీగా లోతుగా అధ్యయనం చేసి ’కోవర్టు’ అధికారులను ప్రక్షాళన చే యాలని ఉద్యోగులు కోరుతున్నారు.

ప్రభుత్వం మారినా, ప రిపాలనా వ్యవహారాల్లో,విధాన నిర్ణయాల్లో ‘మా ర్పు’ తీసుకు రావాలని సీఎం కంకణం కట్టుకున్నా ‘కళంకిత’ అధికారులు ఆయనను ’మిస్ గైడ్’ చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దాలని, వారానికో రోజు క్షేత్ర స్థాయి పర్యటన జరపాలని,నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్ష జరపాలని,ఐఏఎస్ అధికారులకు సీఎం దిశానిర్దేశం చేసినా ఆచరణలో కొద్ధి మంది మినహా,ఆ ఆదేశాలను మిగతావారు ఖాతరు చేయడం లేదని అధికారవర్గాలంటున్నవి.
ఐఏఎస్ అధికారులందరూ విధిగా తమ పరిధిలోని శాఖలు,విభాగాలపై పట్టు సాధించాలని,ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజా పాలనను అందించేందుకు అందరూ బాధ్యతగా పని చేయాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. తమ శాఖల పని తీరును మెరుగుపరిచేందుకు ప్రక్షాళన చేసుకోవాలని సూచించినా ఫలితం కానరావడం లేదు.రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని, ఒక్కో అధికారి ఒక్కో ’ఫ్లాగ్ షిప్’ ఐడియాను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించినా వాటిని ఆచరణలో పెడుతున్న ఐఏఎస్ అధికారులు కరువయ్యారు.

ఉమ్మడి రాష్ట్రం కాలం నుంచి ఇప్పటివరకు పలువురు ముఖ్యమంత్రులతో పని చేసిన అనుభవమున్న అధికారులు ఇప్పటికీ కీలక విభాగాల్లో ఉన్నారు. అందులోనూ కేసీఆర్ హయాంలో పలు అవకతవకలు,అక్రమాలకూ పాల్పడినట్టు ఆరోపణలు ఉన్న ఉన్నతాధికారులు పాతుకుపోయారని కొందరు అధికారుల ఆవేదన. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో అయిదు గ్యారంటీలను అమలుచేసింది.‘వ్యక్తుల ఇష్టాయిష్టాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేద‘ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐఏఎస్ ల సమావేశాల్లోచేసిన వ్యాఖ్యలను కొందరు ’కోవర్టు’ అధికారులు అలుసుగా తీసుకున్నట్టు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని, ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చే సలహాలు సూచనలు పాటించాలని సీఎం గతంలోనే కోరారు.
కానీ కొన్ని విధానపరమైన నిర్ణయాల్లో సీఎం రేవంత్ రెడ్డికి సీనియర్ ఐఏఎస్ అధికారులు సరైన సూచనలు ఇవ్వని కారణంగానే ’హైడ్రా’ వంటి సంస్థ కార్యకలాపాలతో ప్రజల్లో ప్రభుత్వం ఇమేజ్ దెబ్బతింటున్నట్టు ఒక భావన ఉన్నది.’హైడ్రా’ లక్ష్యం విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేకపోయినా ఆ సంస్థ ’దూకుడు’ సీఎం ప్రతిష్టను దెబ్బ తీస్తున్నది.

’హైడ్రా’ ఏర్పాటుకు ముందుగానే దాని కార్యాచరణ ప్రణాళికపై తగిన ’హొమ్ వర్క్’ చేసి సామాన్య, దిగువ మధ్యతరగతి వర్గాల్లో వ్యతిరేకత రాకుండా వ్యవహరించి ఉంటే ప్రస్తుత పరిస్థితి నెలకొనేది కాదన్న అభిప్రాయం రేవంత్ రెడ్డికి గట్టి మద్దతు ఇస్తున్న అధికారులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకుల్లో వ్యక్తమవుతున్నది. ఒకే దఫా రుణ మాఫీ చేసి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రుణ మాఫీ సాధ్యమే కాదన్న అంచనాతో హరీష్ రావు రాజీనామా చేస్తానని సవాల్ విసిరి తోక ముడిచిన విషయం తెలిసిందే. అయితే రుణ మాఫీ విషయంలో ప్రభుత్వానికి తగిన మైలేజి రాకుండ కొందరు ఉన్నతాధికారులు వైట్ రేషన్ కార్డు వంటి తలా తోకా లేని నిబంధనలు పెట్టినట్టు అధికార వర్గాలలో చర్చ జరుగుతోంది. ఈ విషయం ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా తెలుసుకొని ఆ నిబంధనను తొలిగించినట్టూ సమాచారం.కాగా తెలంగాణ అభివృద్దికి ’మెగామాస్టర్ ప్లాన్ 2050 విజన్’ దిశగా ముందుకు వెళ్ళడానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.అందుకు తగినట్టుగానే ఆయన ’ఫ్యూచర్ సిటీ’ కి డిజైను చేశారు.

కోఠి లోని మహిళాయూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టినా, విద్యా, వ్యవసాయ కమిషన్ లను ఏర్పాటు చేసినా,18 సంవత్సరాలుగా పెండింగులో ఉండిన జవహర్ లాల్ నెహ్రూ సొసైటీ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారంలో రేవంత్ తీసుకున్న నిర్ణయాలను ప్రజలంతా స్వాగతిస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు, సీనియర్ రాజకీయవేత్తలు, మేధావులు సైతం రేవంత్ నిర్ణయాలను సమర్థిస్తున్నారు. కాగా ఫార్మాసిటీ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం వేలాది ఎకరాల భూ సేకరణ జరిపింది. కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలు పరిశ్రమలు కూడా ప్రారంభించాయి. పలు రియల్ ఎస్టేట్ సంస్థలు కోట్లాది రూపాయల వ్యాపారం సాగిస్తున్నవి. ఫార్మాసిటీ రద్దయితే, రియల్ ఎస్టేట్ రంగానికి తీరని నష్టం వాటిల్లుతుందని గ్రహించిన వెంటనే ’ఫార్మాసిటీ రద్దు’ ప్రకటనను సీఎం భేషజాలకు పోకుండా వెనక్కి తీసుకున్నారు. అవుటర్ రింగు రోడ్డు, రీజనల్ రింగు రోడ్డు మధ్య ఫార్మా సిటీని దశల వారీగా జీరో కాలుష్యంతో క్లస్టర్లుగా ఏర్పాటు చేయాలన్నది ముఖ్య మంత్రి అభిమతం.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రియల్ ఎస్టేట్ రంగం భారీగా దెబ్బతిన్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే తాజాగా ఫ్యూచర్ సిటీ ప్రకటనతో మళ్లీ రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకునే అవకాశాలు బాగా మెరుగయ్యాయి. సకాలంలో జీతాలు అందక ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లు ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో మార్పు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే జీతాల చెల్లింపును గాడిన పెట్టారు. పాలనపై పట్టు బిగించడానికి రేవంత్ రెడ్డి రేయింబవళ్లు చేస్తున్న ప్రయత్నాలకు ’కోవర్టు’ ఐఏఎస్ అధికార్ల వ్యవహారశైలి అడ్డంకిగా మారినట్టు సచివాలయంలో చర్చ సాగుతున్నది. కేసీఆర్ కు భిన్నంగా ’ప్రజాపాలన’ అందించాలని రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.అదే విధంగా పాలనపై తన ’ముద్ర ’ఉండేలా చూస్తున్నారు. కారణాలేవైనా కొద్ది కాలంగా కేసీఆర్ గురించిన చర్చ మీడియాలో, ప్రజల్లో లేదు. పరిపాలన తీరు, సాఫల్య వైఫల్యాలపై మాత్రమే ప్రజల్లో చర్చ ఉండేలా ముఖ్యమంత్రి రచించిన ప్రణాళిక విజవంతమయ్యింది.

కానీ గత ప్రభుత్వంలో అనేక అవకతవకలకు పాల్పడి,కేసీఆర్,కేటీఆర్ ల నుంచి పెద్ద ఎత్తున ప్రయోజనాలు పొందిన కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఇది రుచించడం లేదు. అందుకే రేవంత్ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ’పరోక్షంగా’ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. విధాన నిర్ణయాలలో లాభ నష్టాల గురించిన అంచనా సీనియర్ అధికారులకు,వారి అనుభవం దృష్ట్యా ఉంటుంది. కానీ వారు ఆ విషయాలను సీఎంకు తెలియజేయడం లేదని కింది స్థాయి అధికారులంటున్నారు. అలాగే ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని కొందరు ఐఏఎస్ అధికారులు కేటీఆర్‌కు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నట్టు కూడా కింది స్థాయి అధికారుల్లో అనుమానాలున్నాయి .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News