Friday, November 22, 2024

ఢిల్లీకి వెళ్లిన సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్ బుధవారం ఢిల్లీకి వెళ్లారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సిఎం భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వరద నష్టం అంచనాలకు సంబంధించి కేంద్ర సాయాన్ని సిఎం కోరనున్నారు. భేటీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షం సృష్టించిన బీభత్సం, అస్తి, ప్రాణ, పంట నష్టాలపై సీఎం రేవంత్ ప్రధాని మోడీకి సీఎం రేవంత్రెడ్డి సమగ్ర నివేదికను అందజేయనున్నారు. దీనికి సంబంధించిన అపాయింట్‌ను ఫిక్స్ అయినట్టుగా సమాచారం. మరోవైపు ఢిల్లీ పర్యటనలో భాగంగా సిఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నేడు (గురువారం) భేటీ కానున్నారు. అదేవిధంగా వరద బాధితుల సహాయార్థం కేంద్రం నుంచి నిధులు విడుదల చేసి ఆదుకోవాలని హోంమంత్రిని కోరనున్నారు. సిఎంతో పాటు ఢిల్లీకి కొత్త పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్లనున్నారు. అనంతరం వారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలువనున్నారు. సిఎం రేవంత్‌రెడ్డి పర్యటన రెండురోజులు పాటు ఉండే అవకాశం ఉందని అధికారికవర్గాలు తెలిపాయి.

మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం
దీంతోపాటు హస్తినలో కాంగ్రెస్ హైకమాండ్‌తో మంత్రివర్గ విస్తరణపై రేవంత్ చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పెద్దల చూపు ఎవరిపై ఉంటుందోనని కాంగ్రెస్ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేడు (గురువారం) సాయంత్రం కాంగ్రెస్ హైకమాండ్‌తో రేవంత్ రెడ్డి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. నామినేటెడ్, ఎమ్మెల్సీ స్థానాల భర్తీ, పిసిసి చీఫ్ నియామకం పూర్తవ్వడంతో ప్రస్తుతం అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే పడింది. డిసెంబర్ 7వ తేదీన సిఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఇంకా ఆరు కేబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. హోం మంత్రిత్వశాఖ, మున్సిపల్, విద్య, మైనింగ్‌తో పాటు పలు కీలక శాఖలు సిఎం వద్దే ఉన్నాయి.

రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్ విస్తరణలో పలువురు సీనియర్ మంత్రి పదవులు ఆశిస్తున్నారు. రేసులో ఆదిలాబాద్ నుంచి గడ్డం వివేక్, వినోద్‌లు ఉన్నారు. మంచిర్యాల నుంచి ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు, నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డిలు ఉన్నారు. వీరితో పాటు నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్, మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ, అజారుద్దీన్ మంత్రి పదవులను ఆశిస్తున్నారు. వీరిలో ఎవరిని పదవులు వరించనున్నాయని త్వరలోనే తేలనుంది. అనూహ్యంగా ఇంకెవరైనా రేసులోకి వచ్చి పదవులు దక్కించుకుంటారన్నది చూడాల్సి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలు పూర్తి కావస్తోంది. ఇప్పటి వరకు సంపూర్ణంగా కేబినెట్ విస్తరణ జరగలేదు. దీనికి సంబంధించిన ముహూర్తం ఖరారైందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీ పెద్దలకు ఆహ్వానం
సిఎం రేవంత్ వెంట తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) కొత్త అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి వెళ్లారు. అధిష్టానం పెద్దలను కలిసి తనను అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేయనున్నారు. దాంతో పాటు ఈ నెల 15వ తేదీన జరగనున్న తన పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి వారిని ఆహ్వానించబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గీలు పేర్కొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News