Saturday, December 21, 2024

రోదసి నుంచే వోటు హక్కు వినియోగించుకోనున్న సునీతా విలియమ్స్

- Advertisement -
- Advertisement -

సాంకేతిక సమస్యల వల్ల ఐఎస్‌ఎస్‌లో చిక్కుకుపోయిన సునీత, విల్మోర్
అమెరికా ఎన్నికల్లో వోటు వేస్తామని వెల్లడి
అంతరిక్షం నుంచి వోటు వేయడానికి నిరీక్షిస్తున్నామన్న సునీత

వాషింగ్టన్ : ఫిబ్రవరి నుంచి అంతర్జాతీయ రోదసి కేంద్రం (ఐఎస్‌ఎస్)లో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ నవంబర్ 5 నాటి యుఎస్ అధ్యక్ష ఎన్నికల్లో రోదసి నుంచే వోటు వేయాలని యోచిస్తున్నారు. ‘పౌరులుగా మాకు అది అత్యంత ముఖ్యమైన బాధ్యత. రోదసి నుంచే వోటు వేయగలగడానికి ఎదురుచూస్తున్నా. ఇక్కడ ఎంతో చల్లగా ఉంది’ అని భారత సంతతికి చెందిన సునీత శుక్రవారం మధ్యాహ్నం విలేకరులతో ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పారు. 58 ఏళ్ల సునీత, 61 ఏళ్ల విల్మోర్ జూన్ నుంచి తమకు నివాసంగా ఉన్న ఐఎస్‌ఎస్ నుంచి శుక్రవారం విలేకరుల గోష్ఠిలో పాల్గొన్నారు. వారి బోయింగ్ స్టార్‌లైనర్ రోదసి నౌక ప్రయాణం మధ్యలో అనేక సమస్యలకు గురైంది. అది 8 రోజుల సంకల్పిత ప్రయాణం అనంతరం వారిని స్వదేశానికి తీసుకురాలేకపోయింది.

‘బ్యాలట్ కోసం నా విజ్ఞప్తిని పంపించా’ అని విల్మోర్ చెప్పారు. ‘ఆ ఎన్నికలతో సహా పౌరులుగా మేము నిర్వర్తించే అత్యంత ముఖ్యమైన పాత్ర అది. నాసా మాకు ఆ పని సుగమం చేస్తున్నది’ అని ఆయన తెలిపారు. అయితే, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లలో ఎవరికి తాము వోటు వేసేదీ వారు సూచించలేదు. నాసా ఉద్యోగులు రోదసి నుంచి వోటు వేయడానికి వీలు కల్పిస్తూ టెక్సాస్ శాసనసభ ఒక బిల్లును 1997లో ఆమోదించినప్పటి నుంచి అమెరికన్ వ్యోమగాములు రోదసి నుంచే వోటు వేస్తున్నారని ‘న్యూయార్క్ పోస్ట్’ తెలియజేసింది. ఆ సంవత్సరం నాసా వ్యోమగామి డేవిడ్ వుల్ఫ్ మిర్ స్పేస్ స్టేషన్‌లో రోదసి నుంచి వోటు వేసిన తొలి అమెరికన్‌గా ఘనత సాధించారు. కాగా, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మరి ఏడుగురు వ్యోమగాములతో కలసి ఐఎస్‌ఎస్‌లో నివసిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News