Sunday, November 24, 2024

అప్పుడు కండువా కప్పి.. ఇప్పుడు కాంగ్రెస్‌ కాదంటారా?

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో ఫ్యాక్షన్ తరహా దాడులు జరుగుతున్నాయని, దీంతో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. విదేశీ పర్యటనను ముగించుకొని శనివారం హైదరాబాద్ చేరుకున్న ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి నేరుగా దాడికి గురైన తమ పార్టీ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు, ధ్వంసమైన కిటికీలను, ఫర్నిచర్ ను పరిశీలించి కౌశిక్ రెడ్డి, అతని కుటుంబసభ్యులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సర్కారుపై విరుచుకుపడ్డారు. పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎలకు సంబంధించి హైకోర్టు తీర్పు తర్వాత ఆ 10 మందిలో గుబులు మొదలైoదని, అందువల్లనే కౌశిక్ రెడ్డిపై దాడి జరిగిందని అన్నారు. భారీ వాహనాలతో పోలీసు బందోబస్తుతో తీసుకువచ్చి ప్రభుత్వంమే ఎంఎల్‌ఎ ఇంటిపై దాడి చేయించిందని అన్నారు.

ఇందుకు కారకులు అయిన గాంధీ, అతని అనుచరులతో పాటు, సహకరించిన పోలీసులను సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలకు కాంగ్రెస్ కండువా కప్పారని, నేడు వారు బిఆర్‌ఎస్ సభ్యులని అంటున్నారని, వారు ఏ పార్టీలో ఉన్నారో ఆయా నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి గాంధీకి ఎస్కార్ట్‌తో తీసుకువచ్చి పోలీసులే దాడి చేయించారని అన్నారు. పదేళ్ల తమ పాలనలో ప్రశాంతంగా ఉన్నామని, కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు. కౌశిక్ రెడ్డి ఏం తప్పు మాట్లాడారని కెటిఆర్ ప్రశ్నించారు. ప్రతిపక్షానికి చెందిన నాయకుడికి ఇవ్వాల్సిన పిఏసి చైర్మన్‌ను కాంగ్రెస్‌లో చేరిన గాంధీకి ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తే, పదవి పోతుందని బిఆర్‌ఎస్‌లోనే ఉన్నానని ఎంఎల్‌ఎ గాంధీ అంటున్నారని అన్నారు. ఎందరో ముఖ్యమంత్రులను చూశామని, కానీ ఇలాంటి అసమర్థ సిఎంను ఎన్నడూ చూడలేదన్నారు.

హైదరాబాద్ లో పదేళ్లలో శాంతి భద్రతలు అద్భుతంగా మెయింటైన్ చేశామని, హైదరాబాద్‌లో ఉన్న ప్రజలంతా తమవారే అని, ప్రాంతీయతత్వం మీద దాడులు గతంలో లేవని అన్నారు.తమ పార్టీకి ఓట్లు వేయలేదని, ఒక్క సీటు కూడా ఇవ్వలేదని హైదరాబాద్ ప్రజలపై రేవంత్ రెడ్డి పగ పట్టిండన్నారు. ఇప్పటికి 22 సార్లు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడం దిగటం తప్ప ముఖ్యమంత్రి రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. తొమ్మిదిన్నర నెలలుగా అసమర్థుడి జీవనయాత్ర లాగా రేవంత్ ప్రభుత్వం కొనసాగుతోందని విమర్శించారు.ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేల ఇంటికి చేరి కాళ్లు పట్టుకొని మరి కండువాలు కప్పుతారని, పది మంది ఎంఎల్‌ఎలు వచ్చారు.. ఇంకా వస్తారని కాంగ్రెస్ మంత్రులు నుండి ఎంఎల్‌ఎల వరకు మాట్లాడారని అన్నారు. ఫిరాయింపులపై స్పీకర్‌ని కలిసి సుప్రీంకోర్టు తీర్పులను సైతం ఉటంకిస్తూ ఫిర్యాదు చేశామని అన్నారు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ వేసిందే కౌశిక్ రెడ్డి అని అన్నారు.

హైకోర్టు తీర్పు వచ్చిన రోజునే అరికెపుడి గాంధీని పిఏసి చైర్మన్ గా నియమిస్తూ ప్రకటన చేశారని, ప్రజాస్వామ్య విలువలు తుంగలో తొక్కుతూ ఎలా చేస్తారని ప్రశ్నిస్తే పోలీసుల అండతో ఎంఎల్‌ఎ ఇంటి మీద దాడికి దిగారన్నారు. ఈ రకమైన గుండాగిరి గత పదేళ్లలో ఎప్పుడు జరగలేదని, ఫ్యాక్షన్ సినిమాలు తలపించేలా వచ్చారన్నారు. గ్యారెంటీలు అమలు చేయాలని అడిగితే ఇలాంటి హైడ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేసి, ఎంఎల్‌ఎ అరికెపూడి గాంధీకి రక్షణ కల్పించారని, ముందే గాంధీని హౌస్ అరెస్ట్ చేస్తే ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదని అన్నారు. కెటిఆర్‌తోపాటు ఎంఎల్‌ఎ మాధవరం కృష్ణారావు, ఎంఎల్‌సి శంభీపూర్ రాజు ఇతర నేతలు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News