Friday, October 18, 2024

పాము కాటుతో సెక్యూరిటీ గార్డు మృతి

- Advertisement -
- Advertisement -

కళ్లు కాయలు కాసేలా విధులు నిర్వహించి వచ్చి తాము ఉంటున్న బ్యారెక్‌లో గాఢనిద్రలో ఉన్న సెక్యూరిటీ గార్డులను కట్ల పాము కాటు వేసింది. ఈ ప్రమాదంలో సెక్యూరిటీ గార్డు చేదం నవీన్ (22) మృతి చెందాడు. మరో సెక్యూరిటీ గార్డు వైభవ్ అపస్మారక స్థితికి వెళ్లాడు. ఇద్దరినీ కంపెనీ యాజమాన్యం మంచిర్యాల ఆసుపత్రికి తరలించింది. వివరాల్లోకి వెళ్తే…మంచిర్యాల జిల్లా, తిర్యాణి మండలం, నాయకపుగూడ గ్రామానికి చెందిన చేదం నవీన్, బిహార్‌కు చెందిన వైభవ్ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు.

ఇద్దరు ఏ షిప్టులో విధులు నిర్వహించి శుక్రవారం రాత్రి వారికి సంబంధించిన బ్యారెక్‌లో నిదిస్తున్నారు. శనివారం తెల్లవారు జామున కట్ల పాము బ్యారెక్‌లో నిద్రిస్తున్న ఇద్దరు కార్మికులను కాటు వేసింది. వెంటనే పామును చంపి వేసినట్లు కొందరు సెక్యురిటీ గార్డులు తెలిపారు. వైభవ్‌ను కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా, నవీన్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామం పంపించే ప్రయత్నం చేశారు. దీంతో ఐబి తాండూర్ వరకు వెళ్లిన వారు తిరిగి మృతదేహాంతో ఓరియంట్ సిమెంట్ కంపెనీ ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా బెల్లంపల్లి ఆసుపత్రి వద్ద పోలీసులు అడ్డుకుని మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీలో ఉంచారు.

…ఆసుపత్రి వద్ద ఆందోళన … అధికారులతో చర్చలు విఫలం
ఓరియంట్ సిమెంట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డు చేదం నవీన్ విధి నిర్వహణలో పాము కాటుతో మృతి చెందడంతో అతని కుటుంబానికి ఓరియంట్ సిమెంట్ కంపెనీ న్యాయం చేయాలంటూ ఆదివాసీ సంఘాల నాయకులు బెల్లంపల్లి ఆసుపత్రికి తరలివచ్చి ఆందోళన చేపట్టారు. ఓసిసి అధికారులు ఎజిఎం ఉమామహేశ్వర్‌రావ్, సిఎస్‌డి మోహన్‌హరి, దేవాపూర్ ఎస్‌ఐ ఆంజనేయులు బందోబస్తు మధ్య ఆదివాసీలు, అధికారులకు చర్చలు జరిగినప్పటికీ చర్చలు విఫలం అయ్యాయి. మృతుని సోదరునికి కంపెనీలో పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని, 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని బంధువులు,

ఆదివాసీ సంఘాల నాయకులు కోరినప్పటికీ అధికారులు ససేమేరా అనడంతో సాయంత్రం వరకు కూడా సమస్య పరిష్కారం కాలేదు. ఆసుపత్రి నుండి మృతదేహాన్ని దేవాపూర్ ఓరియంట్ గేటు వద్దకు తీసుకొని వెళ్లేందుకు ఆదివాసీ సంఘాల నాయకులు, కుటుంబీకులు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతవరణం నెలకొంది. దీంతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మందమర్రి సిఐ శశిధర్‌రెడ్డి, బెల్లంపల్లి రూరల్ సిఐ అఫ్జలోద్దిన్, దేవాపూర్ ఎస్‌ఐ ఆంజనేయులు, మందమర్రి ఎస్‌ఐ రాజశేఖర్, బెల్లంపల్లి టూటౌన్ ఎస్‌ఐ మహేందర్ బందోబస్తు నిర్వహించారు.

ఎట్టకేలకు కుదిరిన ఒప్పందం
సాయంత్రం వరకు కొనసాగిన ఉద్రిక్తత సాయంత్రం ఇరు వర్గాలు పట్టు వీడడంతో సమస్య పరిష్కారం అయ్యింది. ఓసిసి అధికారులు, నాయకులు కుటుంబం మధ్య జరిగిన ఒప్పందంలో ఓరియంట్ సిమెంట్ కంపెనీలో మృతుని సోదరుడికి కాంట్రాక్టు హైస్కిల్ వేతనంతో ఉద్యోగం, అతని తల్లికి నెలకు 6 వేల రూపాయల పింఛన్, 8 లక్షల రూపాయల నష్టపరిహారం, అత్యవసరంగా 15 వేల రుపాయలకు ఒప్పందం కుదిరింది. దీంతో ఒప్పందాలు చేసుకున్న అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు కొమ్ముల బాపు, కనక రాజు, మాజీ జడ్‌పిటిసి పల్లె చెంద్రయ్య, పెంద్రం హనుమంతు, మడావి అనంతరావ్, మహేష్ తిర్యాణికి చెందిన యువకులు ఉన్నారు. మృతుని తండ్రి చేదం పెద్దులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దేవాపూర్ ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News