బిజెపి అధికారంలోకి వస్తే సిఎం పదవి కోరుకుంటా
ఆరు సార్లు పార్టీ ఎమ్మెల్యే అనిల్ విజ్
నాయాబ్ సింగ్ సైనీని సిఎం అభ్యర్థిగా ప్రకటించిన బిజెపి
చండీగఢ్ : హర్యానాలో అక్టోబర్ 5న జరిగే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వచ్చిన పక్షంలో ముఖ్యమంత్రి పదవిని కోరుకుంటానని పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ విజ్ ఆదివారం ప్రకటించారు. బిజెపి అధికారంలోకి వచ్చినట్లయితే నాయాబ్ సింగ్ సైని ముఖ్యమంత్రి అవుతారని పార్టీ ఇప్పటికే స్పష్టం చేసిన సమయంలో ఆరు సార్లు ఎంఎల్‌ఎ అనిల్ విజ్ ఆ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సైనీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవికి పార్టీ అభ్యర్థి కూడా. ‘నేనే ఈనాటి వరకు పార్టీ నుంచి ఏదీ కోరలేదు& హర్యానా ప్రజలు నా వద్దకు వస్తున్నారు. అంబాలాలో కూడా నేను అందరి కన్నా సీనియర్‌ను అని, నేను ఎందుకు ముఖ్యమంత్రి కాలేదని జనం నాతో అంటున్నారు. ప్రజల డిమాండ్ మేరకు, సీనియారిటీ ప్రాతిపదికపై ఈ పర్యాయం ముఖ్యమంత్రిని అయ్యేందుకు అవకాశం ఇవ్వాలని అడుగుతాను’ అని విజ్ చెప్పారు.
‘పార్టీ నన్ను సిఎంను చేస్తుందా లేదా అన్నది వారు నిర్ణయించవలసింది. అయితే, వారు నన్ను సిఎంను చేసినట్లయితే, హర్యానా ముఖచిత్రాన్ని, భవితను మారుస్తాను’ అని అంబాలా కంటోన్మెంట్ ఎంఎల్‌ఎ విజ్ చెప్పారు. అంబాలాలో విలేకరులతో భేటీలో చేసిన వ్యాఖ్యల గురించి ఆ తరువాత ‘పిటిఐ’ ఫోన్‌లో అడిగినప్పుడు ‘నేను పార్టీలో అందరికన్నా సీనియర్ ఎంఎల్‌ఎను. ఆరు ఎన్నికలు గెలిచాను. ఏడవ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. పార్టీ నుంచి ఇంత వరకు నేను ఏదీ కోరలేడు. హర్యానా వ్యాప్తంగా జనం నన్ను అడుగుతున్నారు. సిఎం పదవికి అవకాశం ఇవ్వవలసిందని కోరుతాను’ అని చెప్పారు. సైనీని ఇప్పటికే సిఎం అభ్యర్థిగా ప్రకటించారు కదా అని అన్నప్పుడు, ‘అవకాశం కోరుకోవడంపై నిషేధం లేదు. నేను దానిని అడుగుతాను. పార్టీని నిర్ణయం తీసుకోనివ్వండి’ అని విజ్ సమాధనం ఇచ్చారు.