Thursday, December 19, 2024

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్

- Advertisement -
- Advertisement -

ప్రతిష్ఠాత్మకమైన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 4-1 తేడాతో దక్షిణ కొరియాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. మరో సెమీ ఫైనల్లో ఆతిథ్య చైనా టీమ్ విజయం సాధించింది. పాకిస్థాన్‌తో జరిగిన పోరులో చైనా పెనాల్టీ షూటౌట్‌లో జయకేతనం ఎగుర వేసింది. మంగళవారం జరిగే టైటిల్ పోరులో చైనాతో భారత్ తలపడుతుంది. భారత్ ఇప్పటికే నాలుగు సార్లు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. చైనా తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఇక కొరియాతో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి జట్టును హడలెత్తించింది. అటాకింగ్ గేమ్‌తో అలరించిన భారత్ ఏ దశలోనూ కొరియాకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. వరుస దాడులతో ప్రత్యర్థి జట్టును ముప్పుతిప్పలు పెట్టింది. ఎట్టకేలకు 13వ నిమిషంలో భారత్ ప్రయత్నం ఫలించింది.

ఉత్తమ్ సింగ్ అద్భుత గోల్‌ను సాధించాడు. దీంతో భారత్ బోణీ కొట్టింది. ఆ తర్వాత భారత్ జోరును మరింత పెంచింది. 19వ నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ జట్టు తరఫున రెండో గోల్ సాధించాడు. దీంతో ప్రథమార్ధం ముగిసే సమయానికి భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధం ఆరంభంలోనే భారత్ మూడో గోల్ నమోదు చేసింది. జర్మన్‌ప్రీత్ సింగ్ ఈ గోల్‌ను అందించాడు. ఆ తర్వాతి నిమిషంలోనే కొరియా తొలి గోల్‌ను సాధించింది. జిహున్ యంగ్ ఈ గోల్‌ను సాధించాడు. ఆ తర్వాత కూడా భారత్ ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను తన గుప్పిట్లో పెట్టుకుంది. 45వ నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ భారత్‌కు నాలుగో గోల్ సాధించి పెట్టాడు. అద్భుత ప్రదర్శనతో అలరించిన హర్మన్ ఈ మ్యాచ్‌లో కూడా జట్టును ముందుండి నడిపించాడు. కీలకమైన రెండు గోల్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమైన భారత్ అలవోక విజయంతో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇక ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఫైనల్‌కు చేరడం ఇది ఆరోసారి కావడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News