Monday, November 25, 2024

డాక్టర్ల భద్రత బాధ్యత ప్రభుత్వానిదే నైట్ డ్యూటీలు వద్దనడం సరికాదు

- Advertisement -
- Advertisement -

మహిళా డాక్టర్లకు నైట్ డ్యూటీలు వేయవద్దని ప్రభుత్వ ఆసుపత్రులను ఆదేశిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా డాక్టర్లకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని ఆయన స్పష్టం చేశారు. కోల్‌కతాలోని ఆర్‌జి కార్ ఆసుపత్రిలో పోస్టు గ్రాడ్యుయేట్ ట్రెయినీ డాక్టర్ హత్యాచార కేసు దర్యాప్తునకు సంబంధించి సిబిఐ దాఖలుచేసిన స్టేటస్ రిపోర్టుపై మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తీరును సిజెఐ తప్పుపట్టారు. మహిళా డాక్టర్లు నైటీ డ్యూటీలు చేయవద్దని ప్రభుత్వం ఎలా చెబుతుందని, మహిళా డాక్టర్లను ఎందుకు మినహాయిస్తున్నారని సిజెఐ ప్రశ్నించారు. నైట్ షిఫ్ట్‌లో పనిచేయడానికి మహిళా డాక్టర్లు సిద్ధంగా ఉన్నారని, వారికి తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌ను ఉద్దేశించి అన్నారు.

పైలట్లు, ఆర్మీ సిబ్బంది, ఇతరులు కూడా నైట్ షిఫ్ట్‌లలో పనిచేస్తున్నారని సిజెఐ గుర్తు చేశారు. మహిళా డాక్టర్ హత్యాచార ఘటన అనంతరం విధులను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు తాము తిరిగి విధులలో చేరడానికి ఎటువంటి అభ్యతరం లేదని విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపారు. అయితే సోమవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో జరిగిన చర్చల సందర్భంగా తాము కొన్ని డిమాండ్లు తెలియచేశామని, అవి కార్యరూపం దాలిస్తే తాము విధులలో చేరతామని జూనియర్ డాక్టర్లు కోర్టుకు తెలిపారు. సమ్మె చేస్తున్న డాక్టర్లపై ఎటువంటి చర్యలు తీసుకోబోమని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను పరిగణనలోకి తీసుకున్న సిజెఐ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని కపిల్ సిబల్‌ను ఆదేశించారు. ట్రెయినీ డాక్టర్ హత్యాచార ఘటనపై సిబిఐ దాఖలు చేసిన స్టేటస్ రిపోర్టులో పేర్కొన్న అంశాలను అత్యంత దారుణం, ఆందోళనకరంగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. సిబిఐ నివేదికలో పొందుపరిచిన అంశాలను ఈ స్థితిలో వెల్లడించలేమని, దాని వల్ల దర్యాప్తునకు అవరోధం ఏర్పడే అవకాశం ఉందని సిజెఐ పేర్కొన్నారు.

ఈ కేసులో అసలు వాస్తవాలు వెలికితీయడానికి సిబిఐ ప్రయత్నిస్తోందని, ప్రస్తుత అరెస్టుల తర్వాత మరిన్ని వాస్తవాలు బయటకు రావచ్చని సిజెఐ అన్నారు. ఆర్‌జి కార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్‌తోపాటు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ని సిబిఐ అరెస్టు చేసిందని, దర్యాప్తు పురోగతి కోసం వేచి చూద్దామని ఆయన అన్నారు. కాగా..హత్యాచారానికి గురైన ట్రెయినీ డాక్టర్ పేరును తన పేజీల నుంచి తొలగించవలసిందిగా వికీ పీడియాను సిజెఐ ఆదేశించారు. బాధితురాలి పేరును వికీ పీడియా తన పేజీలో కొనసాగించడంపై ఆయన అభ్యంతరం తెలియచేశారు. వివిధ సోషల్ మీడియా వేదికలలో బాధితురాలి హెయిర్‌స్టయిల్‌తో కూడిన చిత్రాలను పొందుపరచడంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News