Friday, December 20, 2024

లెబనాన్‌లో పేలిన పేజర్లు

- Advertisement -
- Advertisement -

లెబనాన్ రాజధాని బీరుట్‌తోపాటు ఇతర ప్రాంతాలలో ప్రజల వద్ద ఉన్న పేజర్లు పేలిపోయి అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుళ్లలో మృతుల సంఖ్యపై ఎటువంటి సమాచారం అందుబాటులోకి రాలేదు. హెజ్బుల్లా సభ్యుల చేతుల్లో ఉన్న పేజర్లు పేలిపోయాయని, ఇది ఇజ్రాయెలీ జరిపిన దాడిగా అనుమానిస్తున్నామని లెబనాన్‌కు చెందిన ఒక అధికారి తెలిపారు. చేతులు, ప్యాంట్ పాకెట్లలో ఉంచుకున్న పేజర్లు పేలిపోవడంతో రక్తసిక్త గాయాలతో అనేక మంది రోడ్లపైన పడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నట్లు అక్కడి మీడియా తెలిపింది. అత్యవసర రోగులను చేర్చుకోవడానికి ఆసుపత్రులన్నీ సిద్ధంగా ఉండాలని లెబనాన్ ఆరోగ్య శాఖ పిలుపునిచ్చింది. సెల్‌ఫోన్లను తమ వెంట ఉంచుకోవద్దని, వాటిని ట్రాక్ చేయడం ద్వారా దాడులు జరిపేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నించవచ్చని హెజ్బుల్లా నయాకుడు హసన్ నస్రల్లా గతంలోనే తమ సభ్యులను హెచ్చరించారు. తాజాగా, ఆరోగ్య శాఖ కూడా ప్రజలు తమ వెంట పేజర్లను ఉంచుకోవద్దని, ఆరోగ్య వర్కర్లు కూడా వవైర్‌లెస్ పరికరాలను వాడవద్దని పిలుపునిచ్చింది.

లెబనాన్‌లో తమ సభ్యులతోసహా పౌరుల వద్ద ఉన్న పేజర్లు పేలిపోయి కనీసం 150 మంది వరకు లెబనాన్‌లోని వివిధ ప్రాంతాలలో గాయపడ్డారని హెజ్బుల్లా అధికారి ఒకరు తెలిపారు. ఈ దాడి వెనుక శత్రువు(ఇజ్రాయెల్) ఉన్నట్లు ఆ అధికారి చెప్పారు. హెజ్బుల్లా సభ్యుల వద్ద ఉన్న కొత్త పేజర్లలో లిథియం బ్యాటరీలు ఉన్నాయని, అవే పేలి ఉంటాయని ఆయన చెప్పారు. ఓవర్‌హీట్ అయినపుడు లిథియం బ్యాటరీల నుంచి పొగ రావడం లేదా కరిగిపోవడం లేదా మంటలు రావడం జరుగుతుంది. రిచార్జబుల్ లిథియం బ్యాటరీలను సెల్‌ఫోన్ల నుంచి లాప్‌టాప్‌లు, ఎలెక్ట్రిక్ కార్ల వరకు వివిధ వినియోగ వస్తువులలో ఉపయోగిస్తారు. కాగా..లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత తీవ్రరూపం దాల్చిన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్, గాజాలోని హమాస్ మధ్య యుద్దం జరుగుతున్న నేపథ్యంలో హమాస్‌కు మద్దతుగా నిలిచిన లెబనాన్‌కు చెందిన తీవ్రవాద గ్రూపు హెజ్బుల్లాకు, ఇజ్రాయెలీ సేనలకు మధ్య గత గడచిన 11 నెలలుగా భీకర పోరాటం సాగుతోంది. ఈ పోరులో లెబనాన్‌లో వందలాది మంది మరణించగా ఆఇజ్రాయెల్‌లో డబన్ల కొద్దీ మరణించారు. ఇరుదేశాల సరిహద్దుల్లో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News