Tuesday, December 3, 2024

గణేశుని నిమజ్జనంలో అపశృతి.. చెరువులో మునిగి యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్‌పోచంపల్లి మండలం, జిబ్లక్‌పల్లి గ్రామంలో గణేశుని నిమజ్జనంలో అపశృతి దొర్లింది. చెరువు నీటిలో మునిగి పబ్బతిగాని ప్రవీణ్ (27) అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ముష్టోమ్‌బావి కాలనీ వాసులు వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు గ్రామం పక్కన గల ఊర చెర్వు వద్దకు రాత్రి సమయంలో చేరుకున్నారు. పబ్బతిగాని ప్రవీణ్‌తో సహా మైలుగాని ఉదయ్, సాయిప్రకాష్, సత్తయ్య, సాయికిరణ్, పబ్బతిగాని ప్రశాంత్ తదితరులు వినాయకుని ప్రతిమతో చెరువు నీటిలోకి దిగారు. వారు నీటిలో దిగిన ప్రాంతంలో గుంతలు లోతుగా ఉండడం, ప్రవీణ్‌కు ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పోయాడు.

మరికొందరు యువకులు ఈతరాక చెరువులో నీటిలో తబ్బిబ్బు అవుతుండడాన్ని గ్రహించి మిగిలిన వారిని బయటకు తీసుకువచ్చారు. ప్రవీణ్ కనిపించక పోవడంతో వెంటనే అదే ప్రాంతంలో గాలించగా నీటి అడుగులో ప్రవీణ్ మృతదేహం లభ్యమైంది. కొనఊపిరితో ఉన్నాడేమోనని చూడగా అప్పటికే మృతి చెందాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలిలో పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. కాగా ఎంతో సంబురంగా వినాయకుని ఉత్సవాలు జరుపుకున్న గ్రామంలో ప్రవీణ్ మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News