Monday, November 18, 2024

రాష్ట్రంలో పాలనే లేదు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంతవరకు పాలనే లేదు…కానీ సిఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 17ను ప్రజపాలన దినోత్సవంగా జరుపుతున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. సిఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలని సూచించారు. తాము అధికారంలోకి రాగానే పెన్షన్ రూ.4 వేలు అన్నారు అని, మహిళలకు రూ. 2500 అన్నారని.. చేతనైతే అది ఇవ్వండి అంటూ రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అన్నారని… 9 నెలలు అయిపోయిందని, అయినా ఉద్యోగాల ప్రస్తావన లేదని… చేతనైతే ఇవ్వన్నీ చేసి చుపెట్టాలన్నారు. రేవంత్ రెడ్డి చేతనైతే హామీలు అమలు చేయాలని, కరెంటు సరిగ్గా ఇవ్వాలని పేర్కొన్నారు. పోలీస్ బండ్లల్లో డీజిల్ పోయడానికి నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. రామగుండంలో రూ.2 కోట్లు డీజిల్ బిల్లులు పెండింగ్ ఉన్నాయని, అక్కడ బంకు వాళ్లు పోలీస్ బండ్లకు డీజిల్ పోయడం లేదని చెప్పారు.

ఇంకో 14 రోజుల్లో వర్షాకాలం ముగుస్తుందని.. ఇప్పటికీ రైతు భరోసా ఇవ్వలేదని మండిపడ్డారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు దెబ్బతిన్నారని విమర్శించారు. ఒక్క నెలలో 30 హత్యలు అయ్యాయని పత్రికలు రాస్తున్నాయని చెప్పారు. హోం మంత్రిని పెట్టి శాంతిభద్రతలు కాపాడాలన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి ఇకనైనా పరిపాలనపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను నెరవేర్చే వరకు మిమ్మల్ని వదిలే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం నాడు సెప్టెంబర్ 17 సందర్భంగా జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి కెటిఆర్ మీడియాతో సమావేశం నిర్వహించారు. ఎంతోమంది పోరాటం వల్ల ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామని కెటిఆర్ అన్నారు. కులాలు, మతాలకు అతీతంగా తెలంగాణ ప్రజలు ఉంటారని చెప్పారు.

సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్‌కు పంపిస్తాం
తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలం ముందు పెట్టుకుందాం అనుకుంటే అక్కడ రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే సచివాలయం ఎదుట దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని స్థాపించారని అన్నారు. గతంలో సోనియాగాంధీని బలిదేవత అని, రాహుల్ గాంధీని ముద్దపప్పు అని రేవంత్‌రెడ్డి తిట్టారని.. ఇప్పుడు వాటిని కవర్ చేసుకోవడానికి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టాడని రేవంత్ రెడ్డి చెప్తున్నారని… కంప్యూటర్ కనిపెట్టిన ఛార్లెస్ బాబేజ్ ఆత్మ ఎక్కడున్నా బాధపడుతుందని విమర్శించారు. ఆయనకు తెలియదు, ఎవరైనా చెబితే వినరు అంటూ ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్‌కు పంపిస్తామని అన్నారు.

రాష్ట్రంలో పారిశుధ్యం పడకేసింది
గురుకులాల్లో విద్యార్థులు విష ఆహారం తిని అవస్థలు పడుతున్నారని కెటిఆర్ తెలిపారు. గురుకుల విద్యార్థినులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. గురుకుల టీచర్లను 2500 మందిని తీసీ పక్కన పెట్టారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశుధ్యం పడకేసిందని.. ఎక్కడ చూసినా చికెన్ గున్యాలు, డెంగ్యూలు, విష జ్వరాలు ప్రబలుతున్నాయని చెప్పారు. పల్లెల్లో ప్రజలు దోమల బారిన పడుతున్న పిచికారి లేదని, హోంగార్డులకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టే విధంగా పరిస్థితి ఉందని, ఏ ఇంట్లో చూసినా పిల్లలు జ్వరాల బారిన పడి బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉంటే ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం కెసిఆర్‌ను బిఆర్‌ఎస్ నాయకులను తిట్టడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని కెటిఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రులు మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ఎంపి వద్దిరాజు రవిచంద్ర, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, పార్టీ నేతలు హాజరయ్యారు.

తెలంగాణ తల్లి విగ్రహానికి కెటిఆర్ పాలాభిషేకం
రాష్ట్ర సచివాలయం ఎదుట దిగంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహాలకు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో కెటిఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. కెటిఆర్ పిలుపు మేరకు పార్టీ నేతలు ఆయా జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News