జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌లో బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 58 శాతంపైగా వోటర్లు తమ వోటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల కమిషన్ (ఇసి) వెల్లడించింది. గట్టి భద్రత ఏర్పాట్ల మధ్య వోటింగ్ ఉదయం 7 గంటలకు మొదలైంది. అధికారుల సమాచారం ప్రకారం, సాయంత్రం 5 గంటలకు మొత్తంగా 58.19 శాతం నమోదైంది. కేంద్ర పాలిత ప్రాంతంలోని 24 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇంత వరకు అత్యధికంగా ఇందర్వల్‌లో 80.06 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తరువాత పాద్దర్ నాగ్‌సెనిలో 76.80 శాతం, కిష్ట్‌వార్‌లో 75.04 శాతం నమోదయ్యాయి. పశ్చిమ దోడాలో కూడా అధికంగా 74.14 శాతం వోట్లు పోలయ్యాయి.
కాశ్మీర్ లోయలో పహల్గామ్‌లో అత్యధికంగా 67.86 శాతం పోలింగ్ నమోదు కాగా, డిహెచ్ పొరా 65.21 శాతంతో. కుల్గామ్ 59.58 శాతంతో, కొకెర్‌నాగ్ 58 శాతంతో, డూరు 57.90 శాతంతో ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. కనిష్ఠంగా త్రాల్ సెగ్మెంట్‌లో 40.58 శాతం నమోదైనట్లు ఇసి వర్గాలు తెలియజేశాయి. పుల్వామా జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో 50 శాతం కూడా పోలింగ్ నమోదు కాలేదు. 2019లో అధికరణం 370 రద్దు తరువాత జెకెలో మొదటి సారిగా ఎన్నికలు జరుగుతున్నాయి.