ఛత్తీస్‌గఢ్ బలరాంపూర్ జిల్లాలోని ఆర్మీ క్యాంప్‌లో బుధవారం ఛత్తీస్‌గఢ్ ఆర్డ్ ఫోర్సెస్(సిఎఎఫ్) జవాను ఒకరు తన సహచరులపై జరిపిన కాల్పులలో ఇద్దరు జవాన్లు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. సిఎఎఫ్‌కి చెందిన 11వ బెటాలియన్‌లోని బి కంపెనీలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ఐజి(సుర్గుజా రేంజ్) అంకిత్ గర్గ్ తెలిపారు. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఈ కంపెనీ ఉంది. కానిస్టేబుల్ అజయ్ సిదర్ తన సర్వీసు రైఫిల్ ఇన్సాస్‌తో తన సహచరులపై కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోందని ఆయన చెప్పారు.
రూపేష్ పటేల్ అనే కానిస్టేబుల్ అక్కడికక్కడే మరణించగా సందీప్ పాండే అనే మరో కానిస్టేబుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గాయపడిన మరో ఇద్దరు కానిస్టేబుల్స్ అంబుజ్ శుక్లా, రాహుల్ బఘెల్‌ను చికిత్స నిమిత్తం కుస్మిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్చారు. కాల్పుల శబ్దం విన్న ఇతర సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది అక్కడకు చేరుకుని కాల్పులు జరిపిన కానిస్టేబుల్‌ను నిర్బంధించారు. ఈ ఘటన వెనుక ఉన్న కారణం ఏమిటో తెలియరావలసి ఉంది. నిందితుడు అజయ్ సిదర్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నక్సల్స్ అణచివేత కోసం జార్ఖండ్ సరిహద్దులో ఈ బెటాలియన్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.