Friday, September 20, 2024

నేటి నుంచి భారత్-బంగ్లా తొలి టెస్టు..చెన్నైలో 9.30గంటలకు షరూ

- Advertisement -
- Advertisement -

చెన్నై: భారత్‌-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు గురువారం తెరలేవనుంది. ఇరు జట్ల మధ్య చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియంలో మొదటి టెస్టు జరుగనుంది. ఈ సిరీస్‌కు ఇరు జట్లు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. సొంత గడ్డపై ఆడుతుండడంతో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇక ఇటీవల పాకిస్థాన్‌ను వారి సొంత గడ్డపై చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్ ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. దీంతో సిరీస్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. భారత పర్యటనలో బంగ్లాదేశ్ రెండు టెస్టులు, మరో మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. రెండో టెస్టుకు కాన్పూర్ వేదికగా నిలువనుంది.

ఫేవరెట్‌గా టీమిండియా..
ఈ సిరీస్‌లో ఆతిథ్య టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లి, వికెట్ కీపర్ రిషబ్ పంత్, స్పీడ్‌స్టర్ జస్‌ప్రిత్ బుమ్రా, స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు జట్టుకు కీలకంగా మారారు. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న భారత్‌కు సిరీస్ గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పాలి.

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్‌తో కలిసి యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. యశస్వి ఆడింది కొన్ని మ్యాచ్‌లే అయినా జట్టుపై తనదైన ముద్ర వేశాడు. మూడు ఫార్మాట్‌లలోనూ అతను అసాధారణ బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు సిరీస్‌లో అందరి దృష్టి సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లిపై నిలిచింది. ఈ సిరీస్‌లో కోహ్లి ఎలా ఆడుతాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. కోహ్లి చెలరేగితే బంగ్లా బౌలర్లకు కష్టాలు ఖాయం. శుభ్‌మన్ గిల్‌కు కూడా సిరీస్ చాలా కీలకంగా మారింది. జట్టులో స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన పరిస్థితి అతనికి నెలకొంది.

కెఎల్ రాహుల్‌ది కూడా ఇలాంటి పరిస్థితే. కొంత కాలంగా వరుస గాయాలతో సతమతమవుతున్న రాహుల్‌కు సిరీస్ సవాల్‌గా మారింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన స్థితి రాహుల్‌కు ఏర్పడింది. ఇందులో అతను ఎంత వరకు సఫలమవుతాడో చెప్పలేం. మరోవైపు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు కూడా సిరీస్ చాలా ప్రత్యేకమని చెప్పాలి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తర్వాత రిషబ్ ఆడుతున్న తొలి టెస్టు సిరీస్ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు అశ్విన్, జడేజా, బుమ్రా, సిరాజ్‌లకు కూడా సిరీస్ కీలకమేనని చెప్పొచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉన్న భారత్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే పట్టుదలతో కనిపిస్తోంది.

తక్కువ అంచనా వేయలేం..
మరోవైపు బంగ్లాదేశ్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. విధ్వంసక బ్యాటర్లతో పాటు మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో బంగ్లాదేశ్ కూడా భారీ ఆశలతో సిరీస్‌కు సిద్ధమైంది. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో జట్టుకు కీలకంగా మారాడు. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో షాంటో జట్టును విజయపథంలో నడిపించాడు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే భావిస్తున్నాడు. లిటన్ దాస్, జాకిర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికుర్ రహీం, షకిబ్ అల్ హసన్, మెహదీ హసన్ మీరాజ్, తస్కిన్ అహ్మద్, తైజుల్ ఇస్లామ్ తదితరులతో బంగ్లాదేశ్ చాలా బలంగా ఉంది. దీంతో సిరీస్‌లో భారత్‌కు గట్టి పోటీ ఎదురైనా ఆశ్చర్యం లేదు.

జట్ల వివరాలు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, అశ్విన్, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ధ్రువ్ జురెల్, బుమ్రా, ఆకాశ్ దీప్, సిరాజ్.

బంగ్లాదేశ్: మహ్మదుల్ హసన్ జాయ్, షద్మన్ ఇసలామ్, జాకిర్ హసన్, మోమినుల్ హక్, నజ్ముల్ హుస్సేన్ షాంటో (కెప్టెన్), రహీం, షకిబ్, లిటన్ దాస్, జాకేర్ అలీ, మెహదీ హసన్ మిరాజ్, ఖాలేద్ అహ్మద్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్, నాహిద్ రాణా, తైజుల్ ఇస్లామ్, నయీం హసన్.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News