Thursday, December 19, 2024

టెంట్లు తొలగించాలని డెకొరేటర్లపై పోలీసుల ఒత్తిడి

- Advertisement -
- Advertisement -

పోలీసుల ఒత్తిడి మేరకే తమ నిరసన శిబిరం వద్ద నుంచి టెంట్లు, వెదురు కొయ్యలు, పెడెస్టల్ ఫ్యాన్లను డెకొరేటర్లు తొలగిస్తున్నారని జూనియర్ డాక్టర్లు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలను నిరాధారంగా పోలీసులు తోసిపుచ్చారు. ఆర్‌జి కార్ ఆసుపత్రిలో పిజి ట్రెయినీ డాక్టర్ హత్యాచార ఘటన దరిమిలా ఆందోళన బాట పట్టిన జూనియర్ డాక్టర్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం స్వస్త భవన్ వెలుపల నిరసన కొనసాగిస్తున్నారు. బుధవారం రాత్రి తాము నిద్రిస్తుండగా డెకొరేటర్లు వచ్చి టెంట్లను తొలగించడం ప్రారంభించారని, ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించగా త్వరలోనే వీటిని మళ్లీ ఏర్పాటు చేస్తామని వారు చెప్పారని ఒక జూనియర్ డాక్టర్ తెలిపారు. దుర్గా పూజ మండపాల కోసం వీటిని తీసుకువెళుతున్నామని, మళ్లీ త్వరలోనే ఏర్పాటు చేస్తామని వారు చెప్పారని ఆ డాక్టర్ తెలిపారు. అయితే..పోలీసుల ఒత్తిడి మేరకే డెకొరేటర్లు టెంట్లను తొలగించినట్లు గురువారం డాక్టర్లు ఆరోపించారు.సమ్మె చేస్తున్న డాక్టర్లకు టెంట్లు, బెడ్లు, పెడెస్టల్ ఫ్యాన్లను స్వచ్ఛందంగా సమకూర్చిన డెకొరేటర్లు ఇప్పడు వాటిని తొలగించడంపై డాక్టర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇవి నిరాధార ఆరోపణలంటూ నగర పోలీసు కమిషనరేట్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి స్పష్టం చేశారు. డెకొరేటర్లపై పోలీసులు ఎందుకు ఒత్తిడి తెస్తారని ఆయన ప్రశ్నించారు. డాక్టర్లకు ఏదైనా సమస్యలు ఉంటే తమకు తెలియచేయాలని, వారికి ఎల్లప్పుడూ సాయం చేయడానికి తాము సిద్ధమని ఆయన చెప్పారు. కాగా..ఆర్‌జి కార్ ఆసుపత్రికి చెందిన జూనియర్ డాక్టర్లు చేస్తున్న విధుల బహిష్కరణ ఆందోళన గురువారం కూడా కొనసాగింది. సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్లు బుధవారం రాత్రి జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సమావేశం ఫలితంపై మెడికోలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ఆందోళన, విధుల బహిష్కరణ కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. డాక్టర్లు సమ్మె చేపట్టి 40 రోజులు కాగా చర్చలలో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించడానికి జరిగిన ప్రయత్నం బుధవారం రాత్రి విఫలమైంది. చర్చల మినిట్స్‌ను లిఖితపూర్వకంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించినట్లు డాక్టర్లు తెలిపారు. అనేక డిమాండ్లను అంగీకరించిన ప్రభుత్వం మౌఖిక హామీలకే పరిమితం అవుతోందని, లిఖితపూర్వకంగా హామీలను కాని, మినిట్స్‌ను కాని ఇవ్వడానికి నిరాకరిస్తోందని డాక్టర్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News