Friday, September 20, 2024

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయడం, పంటల బీమా, రైతు భరోసా, హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలుపనున్నారు. దీంతో పాటు వివిధ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రా ఇప్పటివరకు 99 జీఓ ద్వారా మాత్రమే కొనసాగుతోంది. ఈ సంస్థ ఎఫ్‌టిఎల్ ఉన్న ఆక్రమణలను తొలగిస్తుంటే కొందరు అడ్డుకొని హైడ్రాకు కూల్చివేతల అధికారం లేదంటూ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్ అంశంపై మంత్రిమండలి నిర్ణయం తీసుకోనుంది.

రుణమాఫీపై నిర్ణయం
రాష్ట్రంలో రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణమాఫీని ప్రభుత్వం చేపట్టింది. రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న రుణాలు ఇంకా మాఫీ కాలేదు. దీంతో వారికి దశల వారీగా మాఫీ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కేబినెట్ ఆమోదం కావాలి. రైతుబంధు స్థానంలో రైతుభరోసాను పంట పెట్టుబడుల కోసం ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించిన అమలు, పరిమితులపై జిల్లాల వారీగా అభిప్రా యాలు సేకరణ చేపట్టనుంది. ప్రస్తుతం వానాకాలం పంట ముగింపు దశకు చేరుతున్నందున వెంటనే పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి వస్తోంది. ఈ మేరకు పంటలు వేసిన వారికే సాయం చేస్తామని ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తెలిపారు. దీనిపై మంత్రిమండలి చర్చించి నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వ పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలోనూ అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కులగణనను మూడు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ కులగణన చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు కులగణనకు సంబంధించిన సర్వే మార్గదర్శకాలు మంత్రిమండలి భేటీలో ఆమోదించనుంది.

వరదలపై కేంద్ర సాయానికి వినతిపత్రం
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు ముంపుతో భారీగా నష్టపోయారు. ఇప్పటికే రూ.10 వేల కోట్లకు పైగా నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మేరకు కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. నష్టాన్ని చూసింది. దీనిపై కేంద్రం విదారంగా సాయం చేయాలని మంత్రిమండలి తీర్మానం చేయనుంది. పేద కుటుంబాలకు రేషన్ కార్డుల జారీలో పారదర్శకతను పెంచడానికి ఇప్పటివరకున్న అర్హతలను సవరించాలన్న ప్రతిపాదనపై మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. రేషన్‌కార్డులతో సంబంధం లేకుండానే సాధారణ ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవలను సులభంగా అందించడానికి ఆరోగ్య కార్డుల జారీకి ఆమోదం తెలుపనున్నట్లుగా సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News