Sunday, September 22, 2024

జమిలి ముసుగులో దేశాన్ని కబళించే కుట్ర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : జమిలి ఎన్నికల ముసుగులో అధికారం కాపాడుకోవడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తుందని సి ఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని బిజెపి కబళించాలని చూస్తుందని ఆయన మండిపడ్డారు. శనివారం రవీంద్రభారతిలో జరిన సీతారాం ఏ చూరి సంస్మరణ సభకు ముఖ్యఅతిథిగా రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరిపై పుస్తకాన్ని సిఎం ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ భాషలు, ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారాన్ని కాపాడుకోవాలనుకుంటున్న బిజెపి విధానాలను సీతారాం ఏచూరి తన ఆలోచన విధానాలతో నిలువరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

తమ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు యూనియన్ ఆఫ్ స్టేట్స్ భావనను దెబ్బతీసి జమిలి ఎన్నికల ముసుగు లో బిజెపి చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సిన ఈ చారిత్రాత్మకమైన సందర్భంలో సీతారాం ఏచూరి మన మధ్య లేకపోవడం కమ్యూనిస్టు పార్టీలకే కాకుండా ఈ దేశానికే తీరని లోటని సిఎం అన్నారు. తాను పిసిసి అధ్యక్షుడి అయ్యాక రెండుసార్లు సీ తారాం ఏచూరి కలిశానని సిఎం రేవంత్ తెలిపారు. తాను ఈ దేశానికి అంకితమని చాలామంది ఉపన్యాసాల్లో చెబుతుంటారని కానీ, ఆచరణలో అది సాధ్యం కాదన్నారు. ఏచూరి చూపి న మార్గంలో జమిలి ఎన్నికలను అడ్డుకుంటామని, పోరాడుతామని ఆయన అన్నారు. రాహుల్ గాంధీతో ఏచూరికి చాలా సన్నిహిత సంబంధాఉ ఉండేవని, యూపిఏ ఏర్పాటుతో పాటు అనేక చట్టాలు తెచ్చినప్పుడు పేదలకు అనుకూలమైన నిర్ణయల్లో ఏచూరి పాత్రను గుర్తు చేసుకోవాలన్నారు.

మోడీ స్పందించలేదు…
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ ఖండించకపోవడం బిజెపి ఫాసిస్టు విధానాలను సూచిస్తున్నాయని సిఎం అన్నారు. వీధి రౌడీ మాట్లాడినట్లుగా కేంద్ర మంత్రి మాట్లాడుతుంటే ఇది తప్పు అని చెప్పేందుకు పెద్దమనిషిలా వ్యవహారించే సీతారాం ఏచూరి లాంటి వ్యక్తి లేకపోవడం ప్రజాస్వామ్యానికి నష్టమన్నారు. దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తి కోసం సీతారాం ఏచూరి కృషి చేశారని, బ్రతికున్నంత వరకు నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడే వారు చాలా అరుదుగా ఉంటారని ఆయన అన్నారు. రాజకీయాల్లో ప్రజాప్రతినిధులుగా ఎదిగేందుకు ఇచ్చిన ప్రాధాన్యత నమ్మిన సిద్ధాంతం కొరకు ఇవ్వరన్నారు. సీతారాం ఏచూరితో మాట్లాడుతుంటే దివంగత జైపాల్‌రెడ్డితో మాట్లాడుతున్నట్లు ఉండేదని, రాహుల్, గాంధీ కుటుంబంతో ఏచూరికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. జాతీయ రాజకీయాల్లో నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే తెలుగు వారి సంఖ్య తగ్గుతోందని, విద్యార్థి దశనుంచే సీతారాం ఏచూరి అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించారన్నారు.

ఏచూరి సమయస్ఫూర్తికి నిదర్శనం…
ఈ దేశ రాజకీయాల్లో యునైటెడ్ ఫ్రండ్ ఏర్పాటులో జైపాల్ రెడ్డితో పాటు ఏచూరిది కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. అలాగే యూపిఏ-1, యూపిఏ-2 ప్రభుత్వ ఏర్పాటుతో పాటు పేదల కోసం అనే పథకాలు తీసుకురావడంలో ఏచూరి ముఖ్య పాత్ర పోషించారన్నారు. కేరళలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు ఎన్నికల్లో పోరాటం చేసినా జాతీయ స్థాయిలో మాత్రం కలిసి పని చేసి బిజెపి శక్తులను నిలువరించేందుకు ఏచూరి సమయస్ఫూర్తితో పని చేశారన్నారు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదని ఆయన అన్నారు. కానీ, సీతారాం ఏచూరి మాత్రం తాను నమ్మిన సిద్ధాంత కోసం ఆఖరి శ్వాస వరకు బ్రతకడమే కాకుడా మరణానంతరం ఆయన భౌతికకాయాన్ని పరిశోధనకు ఇచ్చారంటే ఏచూరి నిజంగా ఈ దేశం కోసం అంకితం అయ్యారని ఆయన కొనియాడారు. విలువలు, సిద్ధాంతాలు అంతరించిపోతున్న సందర్భంలో సీతారాం ఏచూరి లేకపోవడం నిజంగా బాధాకరమన్నారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకురావడంలో ఆయన కృషి గొప్పదని సిఎం వివరించారు. గతంలో యూపిఏ ప్రభుత్వం ఏర్పాటులో కమ్యూనిస్టుల పాత్ర చాలా కీలకమన్నారు. ఉపాధిహామీ, ఆహార భద్రత పథకాలు కమ్యూనిస్టుల ఆలోచనలతోనే వచ్చాయన్నారు.

నిబద్ధత కలిగిన నాయకుడు సీతారాం ఏచూరి: కెటిఆర్
పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో సిద్ధాంతం చుట్టూ స్థిరంగా నిలబడ్డ నిబద్ధత కలిగిన నాయకుడు సీతారాం ఏచూరి అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల కాలంలో కడదాక కమ్యూనిస్టుగా బ్రతికిన ఆదర్శనేత ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఏచూరి చిత్రపటానికి నవాళి అర్పించిన కెటిఆర్ అనంతరం సభలో మాట్లాడుతూ సీతారాం ఏచూరికి బిఆర్‌ఎస్ తరపున ఆయన నివాళి అర్పించారు. ఢిల్లీలో వెలిగిన అసలైన హైదరాబాద్ బిడ్డ ఏచూరిఅని ఆయన అన్నారు. ఓట్ల రాజకీయం వేరు, ప్రజల రాజకీయం వేరని తాము ఓట్ల రాజకీయంలో వెనుకబడ్డ ప్రజల కోసం జరిగే పోరాటంలో ముందున్నామని ఏచూరి చెప్పిన మాటలు తనకు ఇంకా గుర్తున్నాయన్నారు. నాయకులుగా, పాలకులుగా ఉండి పోరాటాలు తెలియని వారు ఎంతో మంది ఉండవచ్చని, ప్రజలంటే కేవలం ఓటు బ్యాంకులుగా చూసే వారు ఇంకెందరో ఉన్నారన్నారు. కానీ, ఉన్నత చదువులు చదివిన కుటుంబం నుంచి వచ్చిన సీతారం ఏచూరి అణగారిన వర్గాల కోసం ప్రశ్నించిన గొంతుకగా ఎదిగిన ఏచూరి వ్యక్తిత్వం చాలా గొప్పదన్నారు. ప్రజల కష్టం, వారి సుఖం, దుఃఖం గురించి ఏచూరికి బాగా తెలుసని ఆయన అన్నారు.

భవిష్యత్ రాజకీయ తరాలకు ఆదర్శం
రాజకీయాల్లో ఏచూరి హుందాతనం తమ లాంటి భవిష్యత్ రాజకీయ తరాలకు ఆదర్శమన్నారు. ఒక సామాన్య విద్యార్థి నాయకుడిగా ఉండి నాడు అత్యున్నత స్థానంలో ఇందిరాగాంధీ ముందు నిలబడి ఆమెను రాజీనామా చేయాలని కోరడానికి ఎంత గుండె ధైర్యం కావాలని ఆయన ప్రశ్నించారు. రాజ్యంగాన్ని రాజకీయాల కోసం అపహాస్యం చేస్తున్న ఈ రోజుల్లో రాజ్యాంగాన్ని త్రికరణ శుద్ధితో నమ్మిన వ్యక్తి ఏచూరి అన్నారు. ప్రశ్నించడమే ప్రజాస్వామ్యం అని నమ్మిన వ్యక్తి ఆయన అన్నారు. పదవుల కంటే సిద్ధాంతం, ప్రజా సమస్యలపై పోరాటం, నిత్యం కొత్త విషయాలు నేర్చుకోవాలన్న అభిలాష ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా, చిరంజీవిగా నిలబడేలా చేస్తుందనడానికి ఏచూరి జీవితం ఒక ఉదాహరణగా భావిస్తున్నానన్నారు.

బ్రతికున్నంత వరకు ప్రజల కోసం బ్రతికిన ఏచూరి
మా పార్టీలు వేరైనా, మా సిద్ధాంతాలు వేరైనా, గతంలో వారు తెలంగాణ ఏర్పాటు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసి ఉండవచ్చు, కానీ, ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డలుగా తమ బంధం రక్తసంబంధంగా ఉంటుందన్నారు. బ్రతికున్నంత వరకు ప్రజల కోసం బ్రతికిన ఏచూరి, మరణించాక కూడా తన దేహాం ఈ దేశంలోని వైద్య విద్యార్థుల పరిశోధనకు ఉపయోగపడాలన్న ఆయన ఆశయం చాలా గొప్పదన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదం పడ్డప్పుడు మన మౌనం చాలా ప్రమాదకరమని ఏచూరి చెప్పేవారని అందుకే ఆయన స్ఫూర్తితో రాజ్యాంగం అపహాస్యం అయిన ప్రతిసారీ, ప్రజా హక్కుల కోసం చేతనైన పోరాటం చేద్దామని కెటిఆర్ పిలుపునిచ్చారు.
ఒకే వేదికపై కెటిఆర్, కోదండరాం
తెలంగాణ జన సమితి పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఒకే వేదికపై కనిపించారు. ఈ ఆసక్తికర సన్నివేశం రవీంద్రభారతి వేదికగా చోటుచేసుకుంది. సభలో కెటిఆర్ ప్రసంగించిన అనంతరం వెళ్లి ప్రొఫెసర్ కోదండరాం పక్కన కూర్చున్నారు. ఈ క్రమంలోనే కోదండరాం కెటిఆర్‌ను పలకరించగా వెంటనే కెటిఆర్ సైతం ఆయన్ను పలకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News