Tuesday, September 24, 2024

గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత.. బిఆర్‌ఎస్ నేతల అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఆసుపత్రిలో పరిస్థితులను
అధ్యయనం చేయడానికి వెళ్లిన
బిఆర్‌ఎస్ నిజనిర్ధారణ కమిటీ సభ్యలు..
అదుపులోకి తీసుకన్న పోలీసులు
మనతెలంగాణ/హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి వద్ద సోమవారం ఉద్రిక్తత ఏర్పడింది. దవాఖానలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి వెళ్లిన బిఆర్‌ఎస్ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, బిఆర్‌ఎస్ నేతలమధ్య స్వల్వ తోపులాట చోటుచేసుకున్నది. మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్యతోపాటు ఎంఎల్‌ఎ సంజయ్, మాజీ ఎంఎల్‌ఎ మెతుకు ఆనంద్‌లతో ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడినుంచి తరలించారు. పోలీసు వాహనాన్ని అడ్డుకునేందుకు బిఆర్‌ఎస్ కార్యకర్తలు ప్ప్రయత్నించారు. గాంధీ ఆసుపత్రి సహా రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల అధ్వాన పరిస్థితిని అధ్యయనం చేసేందుకు తాటికొండ రాజయ్య నేతృత్వంలో బిఆర్‌ఎస్ నిజ నిర్ధారణ కమిటీని నియమించిన విషయం తెలిసిందే.

సోమవారం నుంచి నిపుణులైన డాక్టర్లతో కూడిన త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించింది. ఇందులో భాగంగా గాంధీ దవాఖానను పరిశీలించాల్సి ఉండగా, కమిటీ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. ముందుగానే బిఆర్‌ఎస్ నేతలు గాంధీ ఆసుపత్రికి వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు భద్రతను పెంచారు. ఆసుపత్రిలోకి బిఆర్‌ఎస్ నాయకులను రానివ్వకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రాజయ్య సహా కమిటీ సభ్యులైన మాజీ ఎంఎల్‌ఎ మెతుకు ఆనంద్, ఎంఎల్‌ఎ సంజయ్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అనేక నిర్బంధాల నడుమ గాంధీ దవాఖానకు చేరుకున్న కమిటీ సభ్యులతోపాటు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను పోలీసులు అరెస్టు చేశారు.

అరెస్టు చేయడం దారుణం: ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్
మాతాశిశు మరణాలు ఎందుకు పెరిగాయి అనే విషయం అడిగేందుకు వెళ్తే అరెస్టు చేయడం దారుణమని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆవేదన చెందారు. నిర్మాణాత్మకమైన అంశాలపైనే పోరాడుతున్నామన్నారు. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో కూర్చుని మాట్లాడాలని వస్తే అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్య తెలుసుకోవాలని సిఎం అన్నారని ప్రతిపక్ష బాధ్యతగా అదే పని చేస్తున్నామని పేర్కొన్నారు. కానీ అక్రమ అరెస్టులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. గాంధీ ఆసుపత్రిలో ప్రొఫెసర్లు, సీనియర్లు, స్టాఫ్ కొరత ఉందని తెలిపారు.

కమిటీని ఎందుకు అడ్డుకున్నారు: కెటిఆర్
బిఆర్‌ఎస్ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను అడ్డుకోవడంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య పరిస్థితి అధ్యయనానికి నిపుణులైన ముగ్గురు వైద్యులతో నిజనిర్ధారణ కమిటీ వేశామని తెలిపారు. ఆ కమిటీని గాంధీ ఆసుపత్రికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారంటూ ప్రశ్నించారు. వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు దాస్తుందని ధ్వజమెత్తారు. సిఎం, కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా వాస్తవాలను దాచలేరన్నారు. వాస్తవ పరిస్థితిని బయటకు తీసుకొచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

ప్రజల ఆరోగ్య పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది: తాటికొండ రాజయ్య
రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య పరిస్థితి అస్తవ్యస్తంగా, అగమ్య గోచరంగా తయారైందని మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ హయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య రంగంలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉండేదని గుర్తుచేశారు. హెలీకాఫ్టర్లలో ఏజెన్సీ ప్రాంతాలకు వైద్య సామగ్రి తరలించామని చెప్పారు. కానీ, ప్రస్తుత ప్రజా పాలనలో గుడ్డి ఎద్దు చేనులో పడ్డట్టు ఉందని మండిపడ్డారు. ఇది ప్రజాపాలనా..? లేక ఎమర్జెన్సీ పాలనా..? అనేది సిఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని అన్నారు. తాము గాంధీ ఆస్పత్రి సందర్శనకు వెళితే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తక్షణమే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

మాజీ ఎంఎల్‌ఎ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ, ప్రజలకు ముఖ్యమైనవి విద్య, వైద్యం అని… రెండింటిని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. గురుకులాల్లో పురుగుల అన్నం పెట్టిస్తున్న ఘనత రేవంత్ ప్రభుత్వానిదని విమర్శించారు. విద్యార్థులు తమకు సౌకర్యాల కోసం ధర్నా చేస్తున్నారని గుర్తుచేశారు. కెసిఆర్ జిల్లా కో మెడికల్ కాలేజీ తెచ్చారని, పుట్టబోయే బిడ్ద నుంచి చనిపోయే దాకా కెసిఆర్ హయంలో అనేక పథకాలు ఉండేవని పేర్కొన్నారు. ఇప్పుడు కెసిఆర్ కిట్ లేదు.. న్యూట్రిషన్ కిట్ లేదని మండిపడ్డారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే తాము ప్రభుత్వ ఆస్పత్రుల సందర్శనకు వెళ్లాలనుకున్నామని అన్నారు. నియంత పోకడలతో కాంగ్రెస్ ప్రభుత్వం తమను అణిచివేస్తోందని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News