Sunday, December 22, 2024

యుద్ధంతో ఓడిపోయేది మానవాళే..

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: మానవాళి విజయం, ప్రగతి యుద్ధ క్షేత్రంలో ఉండదని , శాంతి సామరస్య స్థాపనలోనే విలసిల్లుతుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అమెరికా పర్యటనలో తుది కార్యక్రమంలో భాగంగా ఆయన సోమవారం ఐరాస సర్వప్రతినిధి సభలో ప్రసంగించారు. శాంతి ప్రస్తుత సార్వజనీన సందేశం అయితీరాల్సిందే. సామరస్యం సర్వవ్యాపితం కావల్సిందే అని ఉద్బోధించారు. శాంతి స్థాపన, సామరస్య వికాసం అనేది ఏ ఒక్కదేశం పనికాదని, ఐరాస మొదలుకుని అన్ని ప్రపంచ సంస్థలు ఇందుకు తగు విధంగా స్పందించాల్సి ఉంటుంది.

ఈ మేరకు ఈ విశ్వవేదికల్లో సరైన సంస్కరణలు అత్యవసరం అని పిలుపు నిచ్చారు. సరైన స్పందన అనేది కేవలం సముచిత మార్పులతోనే సాధ్యం అవుతుందని ఐరాస ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన సమ్మిట్ ఆఫ్‌ది ఫ్యూచర్ కార్యక్రమంలో మోడీ స్పష్టం చేశారు. మానవాళి విజయం కేవలం ఆ ర్థిక ప్రగతితోనే పరిపూర్ణం కాదని, రణరంగాలు ఎప్పుడూ సమస్యలకు పరిష్కారాలు చూపబోవని తెలిపారు.

న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో భవిత కోసం సదస్సు ఇప్పటి అంతర్జాతీయ ఘర్షణలు, పరస్పర దాడుల నేపథ్యంలో అత్యంత కీలకమైన సభగా మారింది. మానవాళి విజయం సమిష్టి బలంతో సాధ్యం అవుతుంది. కలహించుకుని నష్టపోవడంతో ఏదీ సాధించడం కుదరదు. తిరిగి వెనకకు వెళ్లినట్లే అవుతుందన్నారు. ఇప్పుడు ఉగ్రవాదం వంటి సవాళ్లకు తోడుగా వినూత్న రీతిలో సైబర్, మారిటైం, స్పేస్ వంటి రంగాలలో కూడా పరస్పర సవాళ్లు ప్రమాదకర పరిస్థితికి దారితీస్తున్నాయని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్కరణలతో వేదికల బలోపేతంతోనే అవసరం అయిన మార్పు జరుగుతుందని మోడీ తెలిపారు. ఇక్కడ జరిగిన సదస్సులో జనరల్ అసెంబ్లీ భవిత కోసం ఒప్పందం పేరిట ఓ తీర్మానం ఆమోదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News