Friday, January 3, 2025

రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్.కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కు అందజేశారు. కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మన్ మంగళవారం ప్రకటించారు. పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే ఆర్.కృష్ణయ్య రాజీనామా చేశారు. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని, అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు ఆర్. కృష్ణయ్య తెలిపారు. ఇటీవలే రాజ్యసభ సభ్యత్వాలకు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

బీసీ ఉద్యమం బలోపేతానికే రాజీనామా

‘ఇంకా నా పదవీ కాలం నాలుగేళ్లు ఉంది..అయినప్పటికీ బీసీ ఉద్యమం కోసం త్యాగం చేశా. తెలంగాణలో బీసీల ఉద్యమం బలోపేతం చేయాలని కొద్ది నెలలుగా అనేక కార్యక్రమాలు చేపట్టాం. బీసీ రిజర్వేషన్‌లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది..9 నెలలు గడిచినా పెంచలేదు. ఇప్పుడు ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50శాతం పెంచాలి, చట్ట సభల్లో కూడా రిజర్వేషన్ పెంచాలి. రాజకీయాలకు అతీతంగా ఉంటా. బీసీ డిమాండ్లతో ఏ పార్టీ మద్దతు ఇస్తే..ఆ పార్టీ మద్దతు తీసుకుంటా” అని ఆర్.కృష్ణయ్య తెలిపారు.

11 నుంచి పతనం దిశగా

రాష్ట్రానికి సంబంధించి రాజ్యసభలో మొత్తం 11 స్థానాలున్నాయి. 2019లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 11 స్థానాలనూ వైసీపీ సాధించింది. సంఖ్యాబలం పరంగా రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ‘రాజ్యసభలో వందశాతం గెలిచాం. లోక్‌సభ, అసెంబ్లీలోనూ తెదేపాను జీరో చేస్తాం..’ అంటూ అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో జగన్, వైసీపీ కీలక నేతలు బీరాలు పలికారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి. అవమానాలు, ఇబ్బందులూ ఉన్నా ఓపికతో అదే పార్టీలో కొనసాగిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇప్పుడు వైసీపీని వీడుతున్నారు. ఇటీవల బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. తాజాగా ఆర్.కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ బలం 8కి పడిపోయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News