Monday, December 30, 2024

జమిలి ఎన్నికలపై తస్మాత్ జాగ్రత్త

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ తీవ్ర వివాదాస్పదమైన జమిలి ఎన్నికల దిశగా కీలక అడుగు వేసింది. దీని అమలు తీరుపై ఎన్నో సందేహాలు ఉన్నా ఇదేదో చాలా సింపుల్ వ్యవహారంగా కేంద్రం భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. వాస్తవానికి మంగళవారం మీడియాతో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ పదవీ కాలంలోనే జమిలి ఎన్నికలను అమల్లోకి తీసుకొస్తామని ప్రకటించారు. ఆ మరుసటి రోజే కేంద్రం రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సిఫారసులను ఆమోదించింది. అయితే ఇక్కడ సందేహమేమంటే జమిలి ఎన్నికలు జరగాలంటే దాదాపు ఐదు రాజ్యాంగ సవరణలు, ప్రజాప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాలి అని 2018లో లా కమిషన్ ఆర్టికల్ 356, ఆర్టికల్ 324, ఆర్టికల్ 83(2), ఆర్టికల్ 172(1), ఆర్టికల్ 83కు సంబంధించిన పలు సవరణలు చేయాలని ఇదే బిజెపి ప్రభుత్వానికి ఆనాడు సూచించింది.వాటిని ఒకసారి పరిశీలిస్తే.. ఆర్టికల్ 356: రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉన్నది. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ యంత్రాంగం విఫలమైనప్పుడు మాత్రమే ఈ ఆర్టికల్‌ను ఉపయోగించి కేంద్రం ఈ చర్యకు దిగాల్సి ఉంటుంది. ఒకవేళ వేరే సందర్భంలో చట్టసభ రద్దుకు నిర్ణయిస్తే అది రాజ్యాంగ విరుద్ధమే అనిపించుకొంటుంది.

ఆర్టికల్ 172(1): అసెంబ్లీ కాలవ్యవధి ఐదేండ్లుగా కొనసాగుతుంది.అత్యయిక స్థితిలో తప్పించి అసెంబ్లీ కాల వ్యవధిని మరే ఇతర సందర్భాల్లో పొడిగించకూడదు. సభ తొలిసారిగా సమావేశమైన నాటి నుంచి కాల పరిమితి మొదలవుతుంది. ఆర్టికల్ 324: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలి ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతాయి. సమయానుసారం రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఈ ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంట్, శాసనసభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటే చట్టసభ కాల వ్యవధిని సహేతుక కారణాలతో సవరించాల్సి ఉంటుంది.

ఆర్టికల్ 83(2): ప్రజాతీర్పుతో కొలువుదీరిన లోక్‌సభ కాలవ్యవధి ఐదేండ్లు. ప్రత్యేక సందర్భాల్లో మినహాయించి దిగువ సభను రద్దు చేయడానికి వీలులేదు. ఆర్టికల్ 83: పెద్దల సభ కాలపరిమితికి సంబంధించి ఆర్టికల్ 83 సూచిస్తుంది. దీంతో పాటు రాజ్యాంగంలోని 2, 3 చాప్టర్స్, పార్ట్-15లోని పలు అంశాలను, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని కొన్ని నిబంధనలను జమిలి బిల్లు కోసం సవరించాల్సి ఉంటుంది. మరి ఇన్ని సవరణలు చేయాల్సిన బిజెపికి ఇప్పుడు లోక్‌సభలో సొంతంగా ఉన్నవి 240 సీట్లు మాత్రమే. అసలు సొంతంగా ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసుకోలేని స్థితిలో టిడిపి, జెడియు, ఎల్ జెపి (రాంవిలాస్) వంటి పార్టీల మద్దతు ఆధారంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాంటప్పుడు మరి ఈ జమిలి ఎన్నికలకు ఈ పక్షాలు మద్దతు ఇస్తాయా లేదా అన్నది ప్రశ్నార్థకం.

అయితే బిజెపి మాత్రం ఈ విషయంలో ఎన్‌డిఎ పక్షాలన్నీ బిజెపికి మద్దతుగా ఉన్నాయని, ఈ సంస్కరణల ప్రక్రియకు తమకు తగినంత సంఖ్యాబలం ఉన్నదని చెబుతున్నది. కేంద్రం భావిస్తున్నట్టు 2029 ఎన్నికల నాటికి జమిలి ప్రక్రియ అమల్లోకి రావాలంటే అందుకు ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలు పెట్టాల్సి ఉంటుంది. అంటే లోక్‌సభ, అసెంబ్లీల కాలపరిమితులను పార్లమెంటు సవరించిన తర్వాత అనేక రాష్ట్రాల అసెంబ్లీలు తమ కాలపరిమితి కంటే ముందే 2029లో రద్దవుతాయి. అప్పుడు వాటికి 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటే పోలింగ్ నిర్వహిస్తారు. గత ఏడాది 2023లో పది రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అవి మళ్లీ 2028 నాటికి ఎన్నికలకు వెళతాయి. అప్పుడు 2028లో ఏర్పడే కొత్త ప్రభుత్వాల పదవీకాలం సుమారుగా ఏడాదికి అటూ ఇటూగా మాత్రమే ఉంటుంది. వాటిలో హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, తెలంగాణ, మిజోరం, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ ఉన్నాయి. ఇకపోతే ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు మళ్లీ 2027లో నిర్వహిస్తారు. అంటే 2027లో ఆ రాష్ట్రాల్లో ఏర్పడే కొత్త ప్రభుత్వాలు సుమారు రెండేళ్లే అధికారంలో ఉంటాయి. ఇక పశ్చిమబెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2026లోనే నిర్వహించనున్నందున వాటి పదవీకాలం మూడేళ్లకు పరిమితమవుతుంది. కాబట్టి ఇప్పుడు లోక్‌సభ, రాజ్యసభల్లో బిజెపికి ఉన్న సంఖ్యాబలం రీత్యా కీలక బిల్లులు ఆమోదం పొందడంలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకతను మోడీ ప్రభుత్వం ఎదుర్కొంటుంది.

ఎందుకంటే జమిలి ఎన్నికలను ప్రతిపక్షాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఇది అంతిమంగా అధ్యక్ష పాలనకు దారి తీసి సమాఖ్య స్ఫూర్తినే దెబ్బతీసే అవకాశం ఉన్నది. కాబట్టి వాస్తవంగా ఇప్పుడు కావాల్సింది ఒకేసారి ఎన్నికలు కాదు. ప్రజాస్వామ్యం మరింతగా వర్ధిల్లే విధంగా, ధన ప్రలోభాలను గణనీయంగా తగ్గించి, ప్రజాభిప్రాయానికి చట్టసభల్లో తగు ప్రాతినిధ్యం లభించేందుకు ఉన్నంతలో మెరుగైన దామాషా పద్ధతి ఎన్నికల సంస్కరణలు కావాలి. అమెరికాలో అయితే దేశాధ్యక్ష ఎన్నికల్లో 50 రాష్ట్రాల్లో రెండు చోట్ల తప్ప మిగిలిన చోట్ల మెజారిటీ ఓట్లు తెచ్చుకున్న పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్ట్టోరల్ కాలేజీ ప్రతినిధులను మొత్తంగా కేటాయిస్తారు. కానీ మన దేశంలో నియోజకవర్గాల ప్రాతిపదిక విధానంలో డబ్బున్న పార్టీలే ప్రాతినిధ్యం పొందగలుగుతున్నాయి. కొన్ని పార్టీలకు వచ్చిన ఓట్ల మేరకు ప్రాతినిధ్యం ఉండటం లేదు.

దామాషా ప్రాతినిధ్య విధానంలో డబ్బుతో ఓట్లు కొన్నప్పటికీ అలాంటివారు ఎన్నికయ్యే అవకాశం ఉండదు కనుక ఎవరూ డబ్బు పెట్టరు, నిజమైన ప్రజాభిప్రాయం వెల్లడి కావటానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు అధికారమే పరమావధిగా ఉన్న పార్టీలు, వ్యక్తులు డబ్బున్న వారికే పెద్దపీట వేస్తూ అధికారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అందుకే ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తే అన్ని సీట్లు కేటాయించే దామాషా ప్రాతినిధ్యం గురించి ఒక్క వామపక్షాలు తప్ప మిగిలిన పార్టీలేవీ మాట్లాడవు. తరచూ ఎన్నికల వలన ప్రభుత్వాలు దీర్ఘకాలిక విధానాలను రూపొందించే అవకాశాలకు ఆటంకం కలుగుతుందని, ఒకేసారి ఎన్నికలు జరిగితే ఇలాంటి అవకాశం ఉండదనేది కేంద్రంలో బిజెపి వాదన.

పాలకులు మారినా లక్ష్యాల నిర్దేశం, పథకాలు కొనసాగేందుకు ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసిన పెద్దలు దీర్ఘకాలిక విధానాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం, జనాన్ని తప్పు దారిపట్టించే వ్యవహారమే. ప్రతి దానికీ ప్రజాస్వామ్య జపం చేసే వ్యక్తులు, శక్తులూ అభివృద్ధి, ఖర్చు తగ్గించాలనే పేరుతో ప్రజాస్వామిక సూత్రాలకే విఘాతం కలిగించే ప్రతిపాదనను ముందుకు తెస్తున్నారు. ఇది ఫెడరల్ సూత్రాలకు, రాజ్యాంగ మౌలిక స్వభావానికే విరుద్ధం. ఇది ఏక వ్యక్తి ఆధిపత్యానికి దారితీస్తుంది. అందువలన ఇది ఇక్కడికే పరిమితం అవుతుందన్న హామీ ఏముంది? అసలు బిజెపి ఈ ప్రతిపాదనను పదే పదే ఎందుకు ముందుకు తెస్తున్నది? పాలక పార్టీ, అధికార యంత్రాంగంలో జరుగుతున్న ఈ చర్చ, కదలికల కారణంగానే అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు తమ జాగ్రత్తలు తాము తీసుకుంటున్నాయి. దేశ అభివృద్ధి, ప్రయోజనాల గురించి తమకు తప్ప మరొకరికి పట్టవని, అలాగే దేశభక్తి ఇతరులకు లేనట్లుగా, దేశద్రోహులకు మద్దతు ఇస్తున్నట్లు గత 10 సంవత్సరాలుగా ఒక పథకం ప్రకారం ప్రచారం చేస్తున్నారు. కానీ జమిలి ఎన్నికల విధానాన్ని అనుసరించడం అంటే ప్రజాస్వామ్య మౌలిక తత్వానికి వ్యతిరేకమే అవుతుంది. సార్వభౌమాధికారం ప్రజలకు లేకుండా ఎన్నికలను కేవలం ఒక ప్రక్రియలా, తంతులా భావించినట్టు అవుతుంది.

ఈ పద్ధతి అనుసరించడం అంటే ప్రజల బాధ్యత కేవలం అయిదేళ్లకు ఒకసారి ఓటు వేయడానికే పరిమితం చేసి ఆ తరవాత ప్రజలకు ఏ పాత్ర లేకుండా చేయడమే అవుతుంది. ఆ తర్వాత వ్యవహారం అంతా కార్యనిర్వాహక వర్గం చేతిలోనే ఉంటుంది. క్రియాశీలంగా ఉండే ప్రజలు అయిదేళ్ల పాటు వేచి ఉండలేరు అని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా చెప్పిన మాటను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ప్రజా ఉద్యమాలతోపాటు రాష్ట్రాలలో మామూలు పద్ధతుల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే ప్రజాస్వామ్య భావాలు వ్యక్తం చేయడానికి వీలుంటుంది. ప్రజాస్వామ్యానికి ఇది చాలా అవసరం. నిజానికి ఎన్నికల నిర్వహణ అంటే ప్రజల కార్యకలాపాల, అభిప్రాయాల వ్యక్తీకరణకు అవకాశం ఇవ్వడమే. ప్రజాస్వామ్య మనుగడకు ఇది అవసరం. జమిలి ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తోయడం అంటే జనాభిప్రాయ వ్యక్తీకరణకు అవకాశం లేకుండా చేయడమే.

నాదెండ్ల శ్రీనివాస్
9676407140

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News