లైంగిక వేధింపుల కేసులో అరెస్టై ప్రస్తుతం జైలులో ఉన్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీస్ కస్టడీకి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు అనుమతించింది. ఈ కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు జానీ మాస్టర్ ను విచారించాలన్న పోలీసులు వాదనలతో ఏకీభవించిన కోర్టు.. అందుకు అనుమతి ఇచ్చింది. నాలుగు రోజులపాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది. అవసరమైతే న్యాయవాది సమక్షంలో ప్రశ్నించాలని కోర్టు ఆదేశించింది. దీంతో నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ ను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.
అయితే, ఈ కేసులో జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా వేసింది. కాగా, జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన 21 ఏళ్ల యువతి.. తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఫిర్యాదుతో జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ నెల 19 అతన్ని అరెస్టు చేశారు. అనంతరం హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానం.