Saturday, September 28, 2024

కశ్మీరులో 56 శాతం పోలింగ్..ప్రశాంతంగా రెండవ దశ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

జమ్మూ కశ్మీరు అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా 26 స్థానాలకు బుధవారం జరిగిన రెండవ దశ పోలింగ్‌లో 56 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు. రెండవ దశ ఎన్నికలలో 56.05 శాతం పోలింగ్ నమోదైనట్లు జమ్మూ కశ్మీరు ప్రధాన ఎన్నికల అధికారి పికె పోలె తెలిపారు. హజ్రత్‌బల్, రియాసి వంటి ప్రదేశాలలో పోలింగ్ కొంత ఆలస్యంగా కొనసాగుతున్నందున పోలింగ్ శాతం కొద్దిగా పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వాగ్వాదాలు వంటి కొన్ని చిన్నపాటి సంఘటనలు కొన్ని చోట్ల చోటుచేసుకున్నాయని,

మొత్తమ్మీద రెండవ దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఆయన తెలిపారు. రీపోలింగ్ జరగాల్సిన అవసరం ఎక్కడా ఏర్పడలేదని ఆయన తెలిపారు. రెండవ దశ ఎన్నికలను పరిశీలించేందుకు 16 మంది సభ్యుల విదేశీ రాయబారులు ఇక్కడకు వచ్చినట్లు పోలె తెలిపారు. జమ్మూ కశ్మీరులో తీవ్రవాదం ప్రబలిన తర్వాత ఎన్నికల పరిశఋలన కోసం అంతర్జాతీయ పరిశీలకులు ఇక్కడకు రావడం ఇదే మొదటిసారి. అయితే, అంతర్జాతీయ పరిశీలకులను అనుమతించడాన్ని మాజీ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తప్పుపట్టారు. జమ్మూ కశ్మీరులో ఎన్నికలు దేశానికి చెందిన అంతర్గత వ్యవహారమని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News