చైనా బుధవారం అత్యంత శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ (ఐసిబిఎం)ను విజయవంతంగా పరీక్షించింది. అమెరికాలోని ప్రధాన నగరాల టార్గెట్ల దూరం వరకూ ఈ క్షిపణి గురి తప్పదని పేర్కొంటూ చైనా అధికారికంగా ఈ ప్రయోగాన్ని ఆర్బాటంగా ప్రచారం చేసుకుంది. సాధారణంగా చైనా ఎప్పుడూ తమ క్షిపణి పరీక్షలను బహిరంగంగా వెల్లడించడం జరగదు. రక్షణ పాటవాన్ని అతి గోప్యంగా ఉంచుతుంది. అయితే ఇందుకు విరుద్ధంగా చైనా రక్షణ మంత్రిత్వశాఖ వర్గాలు ఇప్పుడీ బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష గురించి ప్రకటించింది. పైగా ఈ మిస్సైల్‌ను పసిఫిక్ మహాసముద్రం గురిచూసుకుని ప్రయోగించారు. దీనిని తాము నిర్ణీత సముద్ర జలాల్లో కూలేలా చేసినట్లు కూడా అధికారికంగా ప్రకటించారు.
హాంగ్‌కాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్టు ఈ ఖండాంతర క్షిపణి ప్రయోగం గురించి ప్రచురించింది. ఈ క్షిపణి అమెరికా భూభాగం లోపలి వరకూ కూడా వెళ్లగలదని, ఈ విధంగా సుదూర ప్రాంతాల లక్ష ఛేదన సామర్థం దీనికి ఉందని పత్రిక తెలిపింది. అయితే ఇది ఎంత దూరం వెళ్లగల్లుతుందనేది నిర్ణీతంగా చైనా వెల్లడించలేదు. చైనా సైన్యం పిఎల్‌ఎ రాకెట్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ క్షిపణిని పరీక్షించారు. తమ ఆయుధ పాటవ పరీక్షల క్రమంలోనే ఇప్పుడు ఈ క్షిపణిని పరీక్షించనట్లు, , సైనిక శిక్షణ, ఇతరత్రా ఆయుధాల పనితీరు, వాటిసామర్థం గీటురాయికే ఈ మిస్సైల్ పరీక్ష జరిగినట్లు వివరించారు. అయితే ఇప్పుడున్న ప్రపంచ స్థాయి ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఖండాంతర క్షిపణి పరీక్ష కలకలానికి దారితీసింది.