మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం 92వ ఏట ప్రవేశించారు. ఆయన సేవలను కాంగ్రెస్ నేతలు కొనియాడారు. ఆయన వినమ్రత, విజ్ఞత, నిస్వార్థ సేవ దేశ భవితను తీర్చిదిద్దాయని లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ శ్లాఘించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004, 2014 మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. 199196లో పివి నరసింహారావు నాయకత్వంలోని ప్రభుత్వంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించి, విస్తృత శ్రేణిలో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారు. డాక్టర్ సింగ్ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌జీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘ ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తున్నాను’ అని ప్రధాని మోడీ ‘ఎక్స్’లో తెలిపారు. మోడీ మాజీ ప్రధానితో ఫోన్‌లో కూడా మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో పార్టీ నేతలు మన్మోహన్ సింగ్‌కు శుభాకాంక్షలు తెలియజేసి, దేశానికి ఆయన సేవలను శ్లాఘించారు. సింగ్ ‘రాజకీయ రంగంలో వినమ్రతకు, గౌరవానికి ప్రతీకగా’ నిలిచారని ఖర్గే పేర్కొన్నారు.
‘మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జన్మదినం సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని ఖర్గే పేర్కొన్నారు. ఆయన మంచి ఆరోగ్యం, ఆనందంతో సుదీర్ఘ జీవితం సాగించాలని ఆకాంక్షిస్తున్నానని ఖర్గే తెలిపారు. ‘డాక్టర్ మన్మోహన్ సింగ్‌జీకి జన్మదిన శుభాకాంక్షలు. మన దేశ భవితను తీర్చిదిద్దడంలో మీ వినమ్రత, విజ్ఞత, నిస్వార్థ సేవ నాకు, కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తి ఇస్తూనే ఉంటాయి. మీరు సదా ఆరోగ్యంతో, ఆనందంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నా’ అని రాహుల్ గాంధీ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. ‘దేశంలో సరళీకరణ, ఆర్థిక సంస్కరణల కర్తకు’ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సంస్థాగత ఇన్‌చార్జి కెసి వేణుగోపాల్ కూడా డాక్టర్ సింగ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన సారథ్యంలో ‘యుపిఎ శకంలో కనివిని ఎరుగని వృద్ధి, పురోగతి, పరివర్తనను’ భారత్ చూసిందని పేర్కొన్నారు. ‘సుప్రసిద్ధ ఆర్థికవేత్త, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మొత్తం జీవితం దేశానికి అంకితం అయింది. దేశంలోని అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను, పురోగతిని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక ప్రజాహిత విధానాలను ప్రవేశపెట్టారు’ అని కాంగ్రెస్ ‘ఎక్స్’ పోస్ట్‌లో కొనియాడింది.