Saturday, December 21, 2024

‘మరణశిక్ష’కు మళ్లీ ప్రాణ ప్రతిష్ఠ!

- Advertisement -
- Advertisement -

దేశంలో మరణశిక్ష అంతం కావడం లేదు. ఫీనిక్స్ పక్షి బూడిద కుప్పలోంచి తిరిగి లేచి వచ్చినట్టు మరణశిక్ష అప్పుడప్పుడు పుట్టుకు వస్తోంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అపరాజిత వుమన్ అండ్ చైల్డ్ (వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అమెండ్‌మెంట్) బిల్ 2024ను ఇటీవల తీసుకురావడమే దీనికి ఉదాహరణ. దీనికి కారణం కోల్‌కతా ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో డాక్టర్ పాశవికంగా అత్యాచారానికి, హత్యకు గురయ్యే సంఘటనే. పశ్చిమ బెంగాల్‌కు ఈ బిల్లు వర్తింప చేసేలా భారతీయ న్యాయ సంహిత 2023(బిఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 చట్టాల్లో మార్పులు తీసుకురావలసిన అవసరం ఉంది.

అత్యాచార నేరానికి మరణ శిక్ష తప్పనిసరి చేస్తూ పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించడంతో రాష్ట్ర గవర్నర్ పాత్ర కీలకమై, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదానికి పంపవలసి వచ్చింది. ఇదే విధంగా ఆగస్టు నెలలోనే అనేక రాష్ట్రాల్లో అత్యాచార బాధితులు దళితులు, ఆదివాసీ మహిళలు, చిన్నారులు అవ్వడం గమనార్హం. 2022 లోనే దేశంలో 31,516 అత్యాచార కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతి గంటకు నాలుగు అత్యాచారాలు జరిగాయని చెప్పవచ్చు. వీటిలో 248 కేసులు అత్యాచారంతోపాటు హత్య/ సామూహిక అత్యాచారాలుగా నేషనల్ క్రైమ్స్ రికార్డు బ్యూరో వెల్లడించింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల్లో క్రమంగా 5399, 3690, 3029 వంతున ఈ కేసులు టాప్‌లో ఉన్నాయి. 2023 అంతానికి ప్రపంచంలో మూడొంతుల దేశాలు మరణశిక్ష విధించడాన్ని రద్దు చేశాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక వెల్లడించింది.

112 దేశాలు పూర్తిగా మరణశిక్షను రద్దు చేసేశాయి. 144 దేశాలు తమ చట్టం లోను, ఆచరణ లోను మరణశిక్షను ఉపసంహరించుకున్నాయి. 55 దేశాలు ఇంకా మరణశిక్షను విధిస్తున్నాయి. దక్షిణాసియాలో భూటాన్, నేపాల్ దేశాలు అన్ని నేరాలకు మరణ శిక్షను నిర్మూలించగా, మాల్దీవులు, శ్రీలంక దేశాలు మాత్రం ఆచరించడం లేదు. భారత్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, మరణశిక్షను అమలు చేస్తున్నాయి. 2023 లో భారత్ 120 మరణ శిక్షలను అమలు చేసిందని ప్రాజెక్టు 39 ఎ వెల్లడించింది. 2022లో కూడా 167 వరకు భారత్‌లో మరణశిక్షలు అమలయ్యాయి. 2023 ఆఖరి నాటికి భారత్‌లో మొత్తం 561 మంది మరణశిక్షకు గురయ్యారు. 2019 లో 378 మరణశిక్షలు అమలు కాగా, అప్పటి నుంచి క్రమంగా ఈ సంఖ్య పెరుగుతూ వచ్చింది. మరణశిక్ష విధింపబడిన వారు చాలా సంవత్సరాలు శిక్ష అమలు కోసం నిరీక్షించడం, వీరిలో చాలా మంది తరువాత నిర్దోషులు కావడం వంటి ఉదంతాలు ఉన్నాయి.

అలాంటివారిలో కొందరు మానసికంగా, భౌతికంగా, అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం లభించలేదు. జైళ్లలో వ్యవస్థాపరమైన లోపాలతో కులమత వర్గ వివక్ష వంటి అమానవీయ పరిస్థితులతో కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. బలహీన వర్గాలకు చెందిన విచారణ ఖైదీలు తమను తాము రక్షించుకోలేకపోతున్నారు. దేశంలోని ఖైదీల్లో మూడింట నాలుగొంతుల మంది ఇలాగే జైళ్లలో మగ్గుతున్నారు. ఇండియన్ పీనల్ కోడ్‌కు బదులుగా భారతీయ న్యాయ సంహిత అమలులోకి వచ్చినా, మరణశిక్ష విధించాల్సిన నేరాల సంఖ్య మాత్రం 12 నుంచి 18 కి పెరగడం గమనార్హం. హత్యతో కూడిన లైంగిక నేరాలకు 2023లో సెషన్స్ కోర్టులు మరణశిక్షలనే విధించాయి. మహిళలు, చిన్నారులపై లైంగిక నేరాల్లో బాధితులు హత్యకు గురైతే తరచుగా ప్రజాగ్రహం పెల్లుబకడమే కాదు, చివరకు నిందితులకు మరణశిక్ష విధించాలన్న డిమాండ్ కొన్ని వర్గాల నుంచి ఎక్కువగా వస్తోంది.

దేశ మత, సాంఘిక సంస్కృతిలో ‘సంహారం’ అన్నది ఒక భాగంగా పాతుకుపోయింది. ఉదాహరణకు దేవతలు దుష్టశక్తులను సంహరించడం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. అదే బాధితులకు సరైన న్యాయం అన్నది ‘ధర్మం’గా భావించబడుతోంది. న్యాయ వ్యవస్థలోనూ ఇది ప్రతిబింబిస్తోంది. కొన్ని చోట్ల నిందితులకు అక్కడి సమాజాలే మరణ శిక్షలు విధిస్తున్నాయి. అయితే ఇలాంటివి వెలుగులోకి రావడంలేదు. గృహహింస నేరాలే కాదు, అపరిచితుల నుంచి కూడా మహిళలకు లైంగిక దాడులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోవైపు సామూహిక అత్యాచారాలతో సహా లైంగిక నేరాలను నిరోధించడానికి మరణశిక్ష అంతగా అవసరమైన చర్య కాదని జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సులు చేయడం ఆలోచించాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News