వైసిపి అధినేత జగన్ తిరుమల పర్యటన రద్దు అయింది. శుక్రవారం మధ్యాహ్నం 3.20 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరాల్సి ఉన్న జగన్ తిరుపతి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ప్రత్యేక విమానాన్ని చివరి నిమిషంలో రద్దు చేయించుకున్నారు. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఆయన శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో డిక్లరేషన్‌పై ఆయన సంతకం చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఈ క్రమంలో జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.‘నా మతమేమిటని అందరూ అడుగుతున్నారని, నా మతం మానవత్వమ’ని కావాలంటే డిక్లరేషన్‌లో రాసుకోవాలని జగన్ సవాల్ చేశారు. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న తర్వాత జగన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డిక్లరేషన్ అంశంపై స్పందించారు. తాను నాలుగు గోడుల మధ్య బైబిల్ చదువుతానని ప్రకటించారు. అందులో తప్పేముందన్నారు. బయటకు వెళ్తే హిందూ సంప్రదాయాలను అనుసరిస్తానని చెప్పారు. అలాగే ఇస్లాంనూ గౌరవిస్తానని, సిక్కిజంను కూడా ఆచరిస్తానని చెప్పుకొచ్చారు.
తన మతం మానవ త్వమేనన్నారు. గతంలో తాను పదిహేను సార్లకుపైగా తిరుమల కొండపైకి వెళ్లి వచ్చానన్నారు. దేవుడి దగ్గరకు వెళ్తూంటే ఏ మతం అని అడుగు తారా ? మాజీ ముఖ్యమంత్రికే ఈ పరిస్థితి వస్తే దళితుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. హిందూ ధర్మాన్ని రాజకీయాలకు వాడుకోవడం కరెక్ట్’ కాదన్నారు. తనను అడ్డుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ నేతల్ని కూడా తీసుకు వచ్చారని ఆరోపించారు. పాదయాత్ర చేసిన తర్వాత నడుచుకుంటూ తిరుమలకు వెళ్లాలని.. ముఖ్యమంత్రి గా ఉంటూ పట్టు వస్త్రాలు సమర్పించానని జగన్ తెలిపారు. అలాంటి తనను అడ్డుకోవాల నుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గుడికి వెళ్లే వ్యక్తిని ఏ మతం అని అడుగుతారా అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో అన్యమతస్తులు శ్రీవారి దర్శనానికి వస్తే తమకు దేవ దేవునిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వడం చాలా కాలంగా సంప్రదాయంగా ఉంది. గతంలో సోనియా గాంధీ, అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్లు ఇచ్చారు.
అయితే ఆ తర్వాత రాజకీయ నేతలు మత పరమైన అంశాల్లో ఇలాంటి డిక్లరేషన్లు ఇవ్వడానికి సిద్ధపడటం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి డిక్లరేషన్ అడుగుతున్న కారణంగానే తిరుమలకు వెళ్లుండా ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. డిక్లరేషన్ విషయంలో ఆయన చేసిన వాదనను బట్టి ఈ విషయం అర్థం చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. కూటమిలోఉన్న బిజెపిని కూడా ప్రశ్నిస్తున్నానని, మత రాజకీయాలు చేయడం ఏమిటని మండిపడ్డారు. తిరుమల లడ్డూకు తయారు చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని జగన్ మరోసారి స్పష్టం చేశారు. కల్తీ జరగకపోయినా జరిగిందని ప్రచారం చేసి చంద్రాబాబే శ్రీవారి ఆలయ ప్రతిష్టను దెబ్బతీశారని, మళ్లీ ఆయనే సిట్ వేశారని మండిపడ్డారు. మొత్తంగా జగన్ తిరుమల పర్యటన రద్దునకు డిక్లరేషనే ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
టిటిడి బోర్డుల ఏర్పాటు : మరోవైపు అన్యమతస్థుల శ్రీవారి దర్శన నిబంధనలు వివరిస్తూ తిరుమలలో టీటీడీ బోర్డులను ఏర్పాటు చేసింది. దర్శనానికి వెళ్లాలంటే తప్పక పాటించాల్సిన, అనుసరించాల్సిన విధానాలను వాటిలో పేర్కొంది. బోర్డులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఏటీసీ సర్కిల్, గోకులం గెస్ట్ హౌస్ వద్ద ప్రదర్శనకు ఉంచారు. ఎండోమెంట్ చట్టం మేరకు అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. డిక్లరేషన్ ఫారాలు అదనపు ఈఓ కార్యాలయం, వైకుంఠం కాంప్లెక్స్, రిసెప్షన్, అన్ని ఉప విచారణాధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని బోర్డుల ద్వారా తెలియజేశారు.