శరద్ పవార్ కుమార్తె సుప్రియ
ముంబయి : తన తండ్రి శరద్ పవార్ స్థాపించిన పార్టీని, దాని అసలు చిహ్నాన్ని తాను ఆయనకు దత్తం చేసేంత వరకు తన పోరు ఆగదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి ఎస్‌పి) నాయకురాలు సుప్రియా సూలె శుక్రవారం ప్రకటించారు. అజిత్ పవార్, ఎనిమిది మంది ఎంఎల్‌ఎలు ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరడంతో శరద్ పవార్ స్థాపించిన ఎన్‌సిపి నిరుడు జూలైలో చీలిపోయిన విషయం విదితమే. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నాయకత్వంలోని వర్గానికి పార్టీ పేరును, ‘గడియారం’ గుర్తును ఎన్నికల కమిషన్ ఆతరువాత కేటాయించింది. శరద్ పవార్ వర్గం పేరును ఆతరువాత ఎన్‌సిపి (ఎస్‌పి)గా మార్చి ‘బాకా ఊదుతున్న వ్యక్తి’ చిహ్నాన్ని దానికి ఇసి కేటాయించింది. ఆగ్నేయ ముంబయిలోని అణుశక్తి నగర్‌లో మహా వికాస్ అఘాడి ర్యాలీలో సుప్రియా సూలె ప్రసంగిస్తూ, ‘పవార్ సాహెబ్ సృష్టించిన పార్టీని, ఆయన చిహ్నాన్ని ఆయనకు ఇచ్చేంత వరకు నా పోరాటం ఆగదు’ అని స్పష్టం చేశారు.
‘నవాబ్ మాలిక్ అంటే గిట్టనివారికి ఏమైంది’ అంటూ అధికార కూటమిపై ఆమె విరుచుకుపడ్డారు. మాలిక్ అణుశక్తి నగర్ సిట్టింగ్ ఎంఎల్‌ఎ. ఆయన అజిత్ పవార్ వర్గానికి మద్దతు ప్రకటించారు. పరారైన మాఫియా నేత దావూద్ సోదరి సాయంతో ముంబయి కుర్లాలో ఒక ఆస్తిని కబ్జా చేసారనే ఆరోపణపై ఇడి 2022 ఫిబ్రవరిలో మాలిక్‌ను అరెస్టు చేసింది. మాలిక్ బెయిల్‌పై నిరుడు విడుదల అయ్యారు. మాలిక్ అధికార కూటమి వైపు మొగ్గు చూపడం పట్ల సుప్రియ నిరాశ వ్యక్తం చేస్తూ, ‘బిజెపితో నవాబ్ భాయ్ ఉండడం చూసి విచారిస్తున్నాను. మిమ్మల్ని జైలులో పెట్టిన పార్టీతోనే మీరు చేతులు కలిపారు’ అని అన్నారు.