లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ ప్రాంతంలోని హెజ్‌బొల్లా ప్రధాన స్థావరంపై ఇజ్రాయెల్ సేనలు శుక్రవారం దాడి జరిపాయి. ఓ వైపు ఐరాస వేదికపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రసంగం ముగిసిన దశలోనే ఈ దాడి జరిగింది. తాము బీరూట్ పరిసరాల్లోని హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయం ధ్వంసానికి దిగినట్లు ఇజ్రాయెల్ బలగాలు ప్రకటించాయి. బీరూట్ అంతటా ఈ దాడుల ప్రకంపనలు కన్పించాయి. పలు చోట్ల ఆకాశంలో పెద్ద ఎత్తున నల్లటి పొగ అలుముకుంది.
ఇరాన్ మద్దతు గల హెజ్‌బొల్లా కంచుకోట వంటి స్థావరం ఉనికి కనుగొని ఇజ్రాయెల్ ప్రతీకారం సాగించింది. తాము హెజ్‌బొల్లా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్‌ను లక్షంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ సేనల అధికార ప్రతినిధి డేనియల్ హగరీ తెలిపారు. హెజ్‌బొల్లా నిర్మూలన వరకూ తమ దాడులు ఆపేది లేదని నెతన్యాహూ ప్రపంచ వేదిక పై నుంచి ప్రకటించిన వెంటనే ఈ దాడులు చోటుచేసుకున్నాయి. అంతిమ విజయం దిశలో తమ కార్యకలాపాలు మరింత విస్తృతపరుస్తామని ఇజ్రాయెల్ సేనల ప్రతినిధి ఒక్కరు వెల్లడించారు. ఇప్పుడు జరిగిన దాడిలో హెజ్‌బొల్లా కార్యాలయం పరిస్థితి ఏమిటనేది వెల్లడికాలేదు.