హైదరాబాద్: నవరాత్రి, దసరా వేడుకలు అక్టోబర్ 3 నుంచి 12 వరకు జరుగనున్నాయి. ఈ సందర్భంగా డిజె మ్యూజిక్ సిస్టం సరఫరాదారులు సౌండ్ సిస్టంను సరఫరా చేయొద్దని సిటీ పోలీస్ తమ సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ హైకోర్టు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి లౌడ్ మ్యూజిక్ ను అనుమతించకూడదని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దాండియా గ్యాదరింగ్స్ లకు డిజె సౌండ్ సిస్టం ను అందించకూడదని గోషామహల్ ఏసిపి కోట్ల వెంకట్ రెడ్డి డిజె సిస్టం అందించే వారిని ఆదేశించారు.
మిలాద్-ఉన్-నబీ సందర్భంగా చార్మినార్ వద్ద ఇటీవల జనరేటర్ అంటుకుంది. గణేశ్ వేడుకలు కూడా ముగిశాయి. మ్యూజిక్ సౌండ్ సిస్టం వల్ల చాలా ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని అనేక మంది ప్రజలు ఫిర్యాదు కూడా చేశారు. లౌడ్ మ్యూజిక్ వల్ల పోలీసులకు వాకీటాకీలు వచ్చే సూచనలు కూడా సరిగా వినపడవు అని హైదరాబాద్ పోలీసులు అంటున్నారు. పోలీసులు గురువారం అనేక రాజకీయ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. కాగా చాలా మంది పోలీసుల నిర్ణయాలను సమర్థించారు.