మణిపూర్‌లో కుకిజో గ్రూప్‌లు పిలుపు ఇచ్చిన బంద్ వల్ల చురాచంద్‌పూర్, కాంగ్‌పోక్పి జిల్లాల్లో శనివారం సాధారణ పౌర జీవనానికి అంతరాయం వాటిల్లిందని, జిరిబమ్‌లో ఒక గ్రామంలో తిరిగి దౌర్జన్య కాండ గురించి సమాచారం అందిందని అధికారులు తెలియజేశారు. వెలుపలి నుంచి రాష్ట్రంలోకి తీవ్రవాదులు ప్రవేశిస్తున్నట్లు భద్రత సలహాదారు కుల్దీప్ సింగ్ ప్రకటన పట్ల నిరసనసూచకంగా దేశీయ ఆదివాసీ నాయకుల వేదిక (ఐటిఎల్‌ఎఫ్), కుకి విద్యార్థుల సంఘం (కెఎస్‌ఒ) సహా కుకిజో వర్గాలు బంద్‌కు పిలుపు ఇచ్చాయి.
ఆ రెండు జిల్లాల్లో మార్కెట్లు, ఇతర వాణిజ్య సంస్థలు మూసివేశారని, వాహనాలు రోడ్లపై నడవలేదని అధికారులు తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు ఏవైనా జరిగినట్లుగా ఇంత వరకు సమాచారం లేదని వారు చెప్పారు. రెండు జిల్లాల్లో శుక్రవారం మొదలైన బంద్ ఆదివారం వరకు కొనసాగుతుంది. రాష్ట్రంలోకి ప్రవేశించిన ‘900 మంది తీవ్రవాదులు’ ఇంఫాల్ లోయ జిల్లాల్లో సరిహద్దు గ్రామాల్లో దౌర్జన్య సంఘటనలకు దిగవచ్చునన్న వార్తల నేపథ్యంలో భద్రత బలగాలు పలు చర్యలు తీసుకున్నాయని సింగ్ ఈ నెల 20న తెలియజేశారు.