370 అధికరణాన్ని కేంద్ర ప్రభుత్వమే పునరుద్ధరించగలదని డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డిపిఎపి) చైర్మన్ గులామ్ నబీ ఆజాద్ శనివారం స్పష్టం చేశారు. ‘జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరణ’ గురించి నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి), కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలను ఆజాద్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ఇప్పటికే వాగ్దానం చేశారని ఆయన తెలియజేశారు. కాగా, పది సంవత్సరాల తరువాత ఎన్నికల్లో పాల్గొంటున్నందుకు జనం ఉత్సాహంతో ఉన్నారని ఆజాద్ తెలిపారు. ఆజాద్ బనిలో విలేకరులతో మాట్లాడుతూ, ‘నేషనల్ కాన్ఫరెన్స్ గాని,
పిడిపి గాని పార్లమెంట్‌లో 370 అధికరణం, రాష్ట్ర హోదా గురించి మాట్లాడలేదు. దానిపై నేను మాట్లాడాను. తాము రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ప్రధాని, హోమ్ శాఖ మంత్రి చెప్పారు’ అని వివరించారు. రాష్ట్ర ప్రతిపత్తి, 370 అధికరణం పునరుద్ధరణకు ఎన్‌సి, కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్ల గురించిన ప్రశ్నకు ఆజాద్ సమాధానం ఇస్తూ, ‘370 అధికరణాన్ని పునరుద్ధరించగలిగేది కేంద్ర ప్రభుత్వం మాత్రమే, ఏ రాష్ట్రమూ కాదు’ అని స్పష్టం చేశారు. కథువా జిల్లా బని అసెంబ్లీ నియోజకవరలో తమ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్న ఆజాద్ ఎన్నికలకు సంబంధించి ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు.