Sunday, September 29, 2024

గ్రూపు రాజకీయాలొద్దు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌ః రాష్ట్ర బిజెపిలో గ్రూపు రాజకీయాలకు తావే లేదని బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలను హెచ్చరించారు. పార్టీ లైన్ దాటకుండా ఎప్పటికప్పుడు, అధిష్ఠానం నిర్ణయానికి అనుగుణంగా పనిచేయాలని హితవు పలికారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపిలు ప్రజా సమస్యలపై పోరాడాలని, నేతలంతా సమన్వయంతో పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. దేశ వ్యాప్తంగా సభ్యత్వ నమోదుపై అన్ని రాష్ట్రాలను సందర్శించి వస్తున్న ఆయన పాట్నా నుంచి నేరుగా శనివారం సాయంత్రం తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకునేందుకు, కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం చేసేందుకు ఆయన హైదరాబాద్ విచ్చేశారు. అంతకు ముందు హైదరాబాద్ చేరుకున్న నడ్డాకు కేంద్ర మంత్రి బండి సంజయ్, తదితరులు బేగంపేట ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు.

అనంతరం హైదరాబాద్‌లోని హరిత టూరిజం ప్లాజాలో రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ పదాధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు నడ్డా మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని సూచించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నేతలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. తెలంగాణలో సభ్యత్వ నమోదుపై ఆరా తీసిన ఆయన తెలంగాణలో 50 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యం కావాలని స్పష్టం చేశారు. లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదు చేయాలని పార్టీ నేతలను నడ్డా ఆదేశించారు. రానున్న 15 రోజుల్లోగా నిర్దేశించిన సభ్యత్వ నమోదు లక్షాన్ని చేరుకోవాలని తెలిపారు. నేతల మధ్య విభేదాలు లేకుండా సమన్వయంతో సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని సూచించారు. అత్యధిక సభ్యత్వ నమోదు చేయించిన వారికే పదవులు దక్కుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర సభ్యత్వ ఇన్‌చార్జి అరవింద్ మీనన్, సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, కాటిపల్లి వెంకట రమణారెడ్డి హాజరయ్యారు. కాగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఎంపీ ఈటల రాజేందర్ అసహనం వ్యక్తం చేశారు. సభ్యత్వ నమోదులో టైం గడువు విధించడం సరికాదని ఈటల అన్నారు. పార్టీ అధిష్ఠానం ఇచ్చిన లక్షం పూర్తి చేస్తామని తెలిపారు. గడువులోపే పూర్తి చేయాలని టార్గెట్ పెట్టడం మాత్రం సరికాదని రాజేందర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News