నేపాల్ దేశంలో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 112కు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం నుండి నేపాల్ లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. అనేక రహదారులు మూతపడ్డాయి. భారీగా ఇళ్ళు, వంతెనలు కొట్టుకుపోయాయి. వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి.
వరదలతో కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 64 మంది గల్లంతయ్యారని, 45 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఖాట్మండు లోయలో 48 మంది ప్రాణాలు కోల్పోయారని, కనీసం 195 ఇళ్లు, ఎనిమిది వంతెనలు దెబ్బతిన్నాయని చెప్పారు. వరదల్లో చిక్కుకున్న దాదాపు 3,100 మందిని భద్రతా సిబ్బంది రక్షించింది. ఖాట్మండు లోయలో 40-45 సంవత్సరాలలో ఈ స్థాయిలో వరదలు ఎప్పుడూ రాలేదని అధికారులు చెబుతున్నారు.