Monday, September 30, 2024

జూనియర్ స్టాలిన్‌కు డిప్యూటీ పగ్గాలు

- Advertisement -
- Advertisement -

తమిళనాడులో ఉపముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ఆదివారం బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటివరకూ రాష్ట్ర యువజన సర్వీసుల మంత్రి అయిన ఉదయనిధి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కుమారుడు. ఇక వివాదాస్పద మనీలాండరింగ్ వ్యవహారంలో జైలు పాలయ్యి , బెయిల్‌పై ఇటీవలే వచ్చిన సీనియర్ మంత్రి సెంథిల్ బాలాజీని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కేబినెట్‌లో మార్పులు చేర్పుల క్రమంలో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి ప్రమాణం చేయించారు. గోవిఛెజియన్, ఎస్‌ఎం నాసర్, ఆర్ రాజేంద్రన్ కొత్తగా మంత్రులు అయ్యారు. ఇక కుమారుడు ఉదయనిధికి కీలక బాధ్యతలను అప్పగించిన సిఎం కీలకమైన విద్యుత్, ఎక్సైజ్ , మద్యనిషేధం శాఖలను తిరిగి సెంథిల్‌కు కట్టబెట్టారు. ఉదయనిధి ఉప ముఖ్యమంత్రి కావడంతో డిఎంకెలో ఇది అధికార రాజకీయ వ్యవస్థలో మూడో తరం నాయకత్వ వరుస అయింది.

తాత కరుణానిధి, తండ్రి స్టాలిన్ ఈ వరుసలో ఇప్పుడు ఉదయనిధి డిఎంకెలో ప్రాబల్యం చాటుకునేందుకు కీలక పగ్గాలు చేపట్టారు. అయితే ఇప్పటికే ఆయన మంత్రిగా ఉన్నందున, ఇప్పుడు జరిగింది కేవలం పదోన్నతి అయినందున విడిగా ఇప్పుడు ప్రమాణస్వీకారం చేయలేదు. రాజ్‌భవన్ ఆవరణలో ఉదయనిధి స్టాలిన్ అందరిని కలుస్తూ హడావిడిగా కన్పించారు. నలుగురు మంత్రులను అభినందించారు. సీనియర్ నేతలకు నమస్కారాలు తెలిపారు. ఇప్పుడు ఉదయనిధి తమిళనాడు కేబినెట్‌లో నెంబరు 2 అయ్యారు.ఈ పరిణామంపై అన్నాడిఎకె , బిజెపి వర్గాలు వేర్వేరుగా విమర్శలకు దిగాయి. కుటుంబ పాలనతో తమిళులకు అన్యాయం జరుగుతోందని నేతలు స్పందించారు. జూనియర్ స్టాలిన్ ఇప్పుడు ప్రిన్స్‌అయ్యారని , అధికారంలోకి రాకముందు సీనియర్ స్టాలిన్ అనేక సార్లు తాను కులుంబ రాజకీయాలకు దూరం అని, తన కుమారుడు కానీ అల్లుడు కాని కుటుంబ సభ్యులు ఎవరూ కానీ రాజకీయాల్లోకి రారని చెప్పారని, ఇప్పుడు కుమారుడికి పట్టం కట్టి ఆయన మోసం చేశారని అన్నాడిఎంకె అధికార ప్రతినిధి కొవై సత్యం స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News