Monday, September 30, 2024

నిష్క్రమించిన నైరుతి రుతుపవనాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యవసాయరంగానికి ఊపిరులూదిన నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయి. అడపా దడపా అక్కడక్కడా తేలిక పాటి చినుకులు పడుతున్నప్పటికీ వర్షాకాలం గడిచిపోయింది. ఈ సారి రాష్ట్రమంతటా మంచి వర్షాలే కురిసినప్పటికీ కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడ్డాయి. రుతుపవనాల ప్రభావం వల్ల రాష్ట్రంలో వార్షిక సగటు వర్షపాతం 919మి.మి కురవాల్సివుంది. అయితే జూన్‌నుంచి సెప్టెంబర్ వరకూ నైరుతి రుతుపవనాల వల్లే 80శాతం వర్షపాతం నమోదవుతుంది. వర్షాకాలం కాలంలో సగటు వర్షపాతం 732.6 మి.మి సాధారణ వర్షపాతం నమోదు కావాల్సివుండగా. ఈ ఏడాది ఇప్పటికే 961.6 మి.మి వర్షపాతం నమోదయింది. సాధారణ వర్షపాతం కంటే 31శాతం అధిక వర్షాలు రాష్ట్రాన్ని తడిపి ముద్దచేశాయి. గ్రేటర్ హైదరాబాద్ నగరం పరిధిలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ 609.9మి.మి సాధారణ వర్షపాతం నమోదు కావాల్సివుండగా, ఏకంగా 800.1మి.మి వర్షం కురిసింది.

రాష్ట్రంలో ఈ నెలలోనే భారీ వర్షాలు వివిధ రంగాలకు ఆపార నష్టాలను మిగిల్చాయి. జూన్‌లో 129.4 మి.మి సాధారణ వర్షపాతానికి గాను 159 మి.మి. కురవగా, జులైలో 229మి.మికి గాను 294.8 మి.మి వర్షం కురిసింది. ఆగస్ట్‌లో 217.4కు 209.9మి.మి వర్షం కురిసింది. ఇక సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం 162.8మి.మికిగాను ఏకంగా 297.9 మి.మి వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 90శాతం అధికంగా వర్షాలు పడ్డాయి. సగటున జూన్ నుంచి ఇప్పటివరకూ 31శాతం అధిక వర్షపాతం నమోదు జరిగింది. రాష్ట్రంలోని 109మండలాల్లో అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. 292మండలాల్లో అధిక వర్షాలు కురిశాయి. 207మండలాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. 4మండలాల పరిధిలో 20శాతం నుంచి 59శాతం వరకు లోటు వర్షపాతం నమోదయింది.రాష్టంలోని 5జిల్లాల్లో అతి భారీ వర్షపాతం నమోదు కాగా, 21 జిల్లాలలో అధికవర్షపాతం , 7జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు జరిగింద. అతి భారీ వర్షపాతం జాబితాలో నారాయణపేట జిల్లాలో 96శాతం , వనపర్తి జిల్లాలో 95శాతం , మహబూబ్ నగర్ జిల్లాలో 86శాతం ,జోగులాంబ గద్వాల జిల్లాలో 78శాతం , నాగర్‌కర్నూల్ జిల్లాలో 74శాతం అధిక వర్షపాతం నమోదయింది. అదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల , పెద్దపల్లి, కామారెడ్డి, హనుమకొండ , జనగాం, జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, మిగిలిన 21జిల్లాలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయింది.

1,29,89,397 ఎకరాల్లో ఖరీఫ్ పంటలు:
రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ముగిసి పోయింది. వివిధ రకాల పంటల సాగు విస్తీర్ణం 1,29,89,397 ఎకరాలకు చేరుకుంది. అందులో ప్రధానంగా వరి , పత్తి సాగు పంటలే అథ్యధికంగా సాగులోకి వచ్చాయి. వరి 65,49,230ఎకరాల్లో సాగులోకి రాగా, పత్తి 43,76,043 ఎకరాల్లో సాగులోకి వచ్చింది. అన్ని రకాల ఆహార పంటలు 77,31,655ఎకరాల్లో సాగులోకి రాగా అందులో 5,90,947ఎకరాల్లో పప్పుధాన్య పంటలు సాగులోకి వచ్చాయి. నూనెగింజ పంటలు ఈ సారి 4,27,577 ఎకరాల్లో సాగు చేశారు. ఇతర వాణిజ్య పంటలు 4,11317 ఎకరాల విస్తీర్ణంలో సాగులోకి వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News