Thursday, December 19, 2024

గత పదేళ్లలో 1,500 చెరువులు కబ్జా:మహేశ్‌కుమార్ గౌడ్

- Advertisement -
- Advertisement -

గత పదేళ్లలో బిఆర్‌ఎస్ హయాంలో 1,500 చెరువులు కబ్జాకు గురయ్యాయని, ఇందులో ఎక్కువ శాతం బిఆర్‌ఎస్ నేతలే ఆక్రమించుకున్నారని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈ విషయంలో బిఆర్‌ఎస్ నాయకులు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వారి వైఖరి ఉందని ఆయన మండిపడ్డారు. అరగంట వాన పడితే హైదరాబాద్ పరిస్థితి దారుణంగా అవుతోందని మహేశ్‌కుమార్ తెలిపారు. వరదల నివారణకే మూసీ ప్రక్షాళన చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గట్టిగా వర్షం పడితే హైదరాబాద్ ఎక్కడిక్కడ స్తంభిస్తుందన్నారు. హైదరాబాద్ భవిష్యత్ కోసమే తాము ముందుకెళ్తున్నామన్నారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వయనాడ్ పరిస్థితి హైదరాబాద్‌కు రావొద్దన్నారు.

వరదలు వస్తే హైదరాబాద్ పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. గ్లోబల్ వార్మింగ్ గురించి బిఆర్‌ఎస్ నేతలకు ఆలోచన లేదని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. మూసీ ప్రక్షాళన బిఆర్‌ఎస్ మేనిఫెస్టోలో లేదా? ఇప్పుడు బిఆర్‌ఎస్ నేతలు ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేయాలని చూస్తే హైడ్రా ఉందన్నారు. మూసీలో ఇప్పటివరకు పేదల గుడిసెలు ఒక్కటి కూడా కూల్చలేదని ఆయన పేర్కొన్నారు. అన్ని పార్టీల ఎన్నికల అజెండాలో మూసీ ప్రక్షాళ ఉందని, మూసీ పరివాహకంలో ఇప్పటివరకు ఒక్క పేదవాడి ఇల్లు కూడా కూల్చలేదని ఆయన తెలిపారు.
నిజామాబాద్‌లో పసుపుబోర్డు గురించి ఎంపి అర్వింద్ మాట్లాడాలి

హైడ్రాను ఒక యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఆక్రమణలను తొలగిస్తే తప్ప హైదరాబాద్‌కు సేఫ్టీ లేదని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. ప్రతి పేదవాడిని అన్ని రకాలుగా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతుందని, పేదోడు కష్టాల్లో ఉంటే వారికి అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ అని ఆయన అన్నారు. తాము దీర్ఘకాలిక ఆలోచనలతో ముందుకెళ్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వ చర్యలకు 90 శాతం మంది సపోర్ట్ ఉందన్నారు. హైదరాబాద్‌కు పూర్వవైభవం తీసుకొస్తామని మహేశ్ కుమార్ పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ నాయకుల ఫాంహౌస్‌ల అభివృద్ధి చెందితే హైదరాబాద్ అభివృద్ధి చెందినట్టేనానని ఆయన ప్రశ్నించారు.

కెటిఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. బిఆర్‌ఎస్ నేతల అరాచక పాలన అందరికీ తెలుసని మహేశ్ కుమార్ తెలిపారు. సోషల్ మీడియాలో బిఆర్‌ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మూసీ కూల్చివేతల విషయంలో విపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు గురించి ఎంపి అర్వింద్ మాట్లాడాలని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News