కాన్పూర్: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో, చివరి టెస్టు రసవత్తరంగా మారింది. తొలి రోజు నుంచే వర్షం బారిన పడిన ఈ మ్యాచ్ సోమవారం నాలుగో రోజు అనూహ్య మలుపులు తిప్పింది. తొలి రోజు 35 ఓవర్ల పాటు మాత్రమే ఆట సాధ్యమైంది. రెండో, మూడో రోజు ఒక్క బంతి కూడా పడకుండానే ఆటను రద్దు చేయాల్సి వచ్చింది. కానీ నాలుగో రోజు వరుణుడు కరుణించడంతో మ్యాచ్ ఊహించని విధంగా మలుపులు తిరుగుతోంది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 74.2 ఓవర్లలో 233 పరుగులకే కుప్పకూలింది.
తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ 34.4 ఓవర్లలోనే 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ చేపట్టిన బంగ్లాదేశ్ సోమవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే బంగ్లా మరో 26 పరుగులు చేయాలి. కాగా, ఓపెనర్ జాకిర్ హసన్ (10), హసన్ మహహూద్ (4) పెవిలియన్ చేరారు. మరో ఓపెనర్ షద్మాన్ ఇసలామ్ (7), మోమినుల్ హక్ (0) క్రీజులో ఉన్నారు. ఇక బంగ్లా కోల్పోయిన రెండు వికెట్లను కూడా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పడగొట్టడం విశేషం.
కుప్పకూలిన బంగ్లాదేశ్..
అంతకుముందు 107/3 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ చేపట్టిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. సీనియర్ బ్యాటర్ ముష్పికుర్ రహీం (11) పరుగులు చేసి పెవిలియర్ చేరాడు. కొద్ది సేపటికే వికెట్ కీపర్ లిటన్ దాస్ కూడా వెనుదిరిగాడు. దాస్ 13 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన స్టార్ ఆటగాడు షకిబ్ అల్ హసన్ కూడా నిరాశ పరిచాడు. షకిబ్ 9 పరుగులు మాత్రమే చేసి అశ్విన్ చేతికి చిక్కాడు. సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్‌తో షకిబ్‌ను పెవిలియన్ బాట పట్టించాడు.
హక్ శతకం..
ఒక వైపు వికెట్లు పడుతున్నా వన్‌డౌన్‌లో వచ్చిన మోమినుల్ హక్ పోరాటం కొనసాగించాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. సహచరులు ఒక్కొక్కరే పెవిలియన్ చేరుతున్నా హక్ ఒత్తిడికి గురికాలేదు. అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హక్ 194 బంతుల్లో 17 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మెహదీ హసన్ మిరాజ్ (20) అతనికి అండగా నిలిచాడు. భారత బౌలర్లలో జస్‌ప్రిత్ బుమ్రా మూడు, సిరాజ్, అశ్విన్, ఆకాశ్‌దీప్ రెండేసి వికెట్లను పడగొట్టారు.
రోహిత్, యశస్వి నయా చరిత్ర..
తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మలు విధ్వంసక ఆరంభాన్ని అందించారు. ఇద్దరు బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరు పరిగెత్తించారు. ఇదే క్రమంలో రోహిత్, యశస్విలు టెస్టు క్రికెట్‌లో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. సంప్రదాయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 50 పరుగులు జోడించి నయా చరిత్రను లిఖించారు. రోహిత్, యశస్విలు తొలి వికెట్‌కు 3 ఓవర్లలోనే 50 పరుగులు జోడించి పెను ప్రకంపనలు సృష్టించారు. గతంలో ఇంగ్లండ్ పేరిట ఉన్న ఈ రికార్డును వీరు తిరగరాశారు. ఇంగ్లండ్ క్రికెటర్లు 4.2 ఓవర్లలో అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకుని చరిత్ర సృష్టిచారు. తాజాగా రోహిత్, యశస్వి జోడీ ఈ రికార్డును బద్దలు కొట్టింది. ధాటిగా ఆడిన రోహిత్ 11 బంతుల్లోనే 3 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 23 పరుగులు చేశాడు.
వన్‌డౌన్‌లో వచ్చిన శుభ్‌మన్ గిల్ కూడా మెరుగ్గా ఆడాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన యశస్వి 51 బంతుల్లోనే రెండు సిక్సర్లు, 12 ఫోర్లతో 72 పరుగులు చేశాడు. గిల్ 4 ఫోర్లు, సిక్సర్‌తో వేగంగా 39 పరుగులు సాధించాడు. మరోవైపు విరాట్ కోహ్లి 35 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 47 పరుగులు చేశాడు. ఇక అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన కెఎల్ రాహుల్ 43 బంతుల్లోనే ఏడు ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు సాధించాడు. కాగా 9 వికెట్లకు 285 పరుగుల వద్ద భారత్ తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. బంగ్లా బౌలర్లలో మెహది హసన్ మిరాజ్, షకిబ్‌లు చెరో నాలుగు వికెట్లను పడగొట్టారు.