Thursday, October 3, 2024

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు

- Advertisement -
- Advertisement -

అన్ని పక్షాలు సంయమనం పాటించాలి
భారత్ పిలుపు

న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ తొలిసారిగా బుధవారం స్పందిస్తూ, అన్ని పక్షాలు సంయమనం పాటించాలని పిలుపు ఇచ్చింది. ఆ వివాదం విస్తృత స్థాయిలో ప్రాంతీయ ఘర్షణగా మారకూడదని భారత్ స్పష్టం చేసింది. హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ అధిపతి హసన్ నస్రల్లా, ఇతర కమాండర్లను ఇజ్రాయెల్ హతమార్చడానికి స్పందనగా ఇరాన్ ఇజ్రాయెల్‌లోకి సుమారు 200 క్షిపణులను ప్రయోగించిన మరునాడు భారత్ ఆ వ్యాఖ్యలు చేసింది. పశ్చిమాసియాలో భద్రత పరిస్థితి తీవ్ర రూపు దాలుస్తుండడం పట్ల తాను అమితంగా కలవరపడుతున్నట్లు భారత్ వెల్లడించింది.

‘చర్చలు, దౌత్యం’ ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించుకోవాలని భారత్ పిలుపు ఇచ్చింది. ‘పశ్చిమాసియాలో భద్రత పరిస్థితి తీవ్ర రూపు దాలుస్తుండడంతో మేము ఎంతో ఆందోళన చెందుతున్నాం. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, పౌరులను కాపాడాలని తిరిగి కోరుతున్నాం’ అని విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ) ఒక ప్రకటనలో తెలియజేసింది. ‘ముఖ్యంగా ఆ వివాదం విస్తృత స్థాయిలో ప్రాంతీయ ఘర్షణగా మారకూడదు. చర్చలు, దౌత్యం ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఎంఇఎ ఆ ప్రకటనలో పేర్కొన్నది.

ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు వద్దు : భారత్

ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున క్షిపణి దాడులను ఇరాన్ ప్రారంభించిన నేపథ్యంలో ఇరాన్‌కు ప్రయాణాలను మానుకోవలసిందని భారతీయులను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇప్పటికే ఆ దేశంలో ఉన్న భారత జాతీయులు అప్రమత్తంగా ఉండాలని, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తుండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆ ప్రాంతంలో భద్రత పరిస్థితి ఉద్రిక్త రూపు దాలుస్తుండడాన్ని భారత ప్రభుత్వ నిశితంగా గమనిస్తున్నదని ఎంఇఎ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఎంఇఎ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఆ ప్రకటనను ఆన్‌లైన్‌లో పంచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News