హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను నటుడు నాగార్జున ఖండించారు. తన కుటుంబం పట్ల కొండా సురేఖ ఆరోపణలు అసంబద్ధం, అబద్ధమని మండిపడ్డారు. మీ ప్రత్యర్థులను విమర్శించడం కోసం సినీ ప్రముఖుల జీవితాలను వాడుకోవద్దని హెచ్చరించారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నాగార్జున డిమాండ్ చేశారు. సినిమాల్లో నటించే ఆడవాళ్లు అంటే అంత చిన్న చూపా? అని మంత్రి కొండా సురేఖపై నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హీరో అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంతం విడిపోవటానికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆరే కారణమంటూ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నాగ చైతన్య, సమంత కాకుండా చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవడానికి కెటిఆర్ కారణమని దుయ్యబట్టారు. టాలీవుడ్‌లో హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసింది కెటిఆర్ కాదా? అని అన్నారు. కెటిఆర్ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని అధికార మదంతో హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని మండిపడ్డారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయడం నిజం కాదా? అని ప్రశ్నించారు. టాలీవుడ్ నుంచి చాలా మంది హీరోయిన్లు ఇతర సినిమా ఇండస్ట్రీకి వెళ్లిపోవడంలో కెటిఆర్ హస్తం ఉందని ఆరోపణలు గుప్పించిన విషయం విధితమే.