Saturday, October 5, 2024

జైళ్లలో కులవివక్షపై సుప్రీం ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జైళ్లల్లో ఖైదీలకు కులాలను బట్టి పనులను అప్పగించడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కులవివక్షతకు దారితీసే ఇటువంటి జైలు మాన్యువల్‌ను కొట్టివేస్తున్నట్లు గురువారం తీర్పు వెలువరించింది. దేశంలోని దాదాపు 11 రాష్ట్రాలలోని జైళ్లలో ఖైదీల కులాలు ప్రాతిపదికన వారికి వివిధ పనులను అంటే మరుగుదొడ్లు కడిగించడం, మురుగు శుభ్రం చేయించడం వంటి పనులను చేయిస్తున్నారనే విషయాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఈ విషయంలో తమ ముందుకు వచ్చిన ప్రజావాజ్యంతో పాటు సుమోటోగా దీనిపై స్పందించింది. ఈ విధంగా కులాల వారిగా పని అప్పగించడం జైళ్లలో కులవివక్షతను పాటించడం కిందికే వస్తుందని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్థీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఏకంగా అధికారికంగానే జైళ్ల మాన్యువల్‌లో ఇటువంటి పద్ధతిని పాటించడం దారుణం అవుతుందని ధర్మాసనం తెలిపింది. జైళ్లలో ఖైదీల పట్ల ఎటువంటి వివక్షత అయినా పనికిరాదు.

దీనిని అన్ని స్థాయిల్లోనూ అరికట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ ఈ విషయంలో ఈ విధంగా అమలు అవుతున్న మాన్యువల్‌కు సంబంధిత రాష్ట్రాలు తగు సవరణలు చేసి తీరాల్సి ఉంటుంది. ఇందుకు మూడు నెలల సమయం ఇస్తున్నామని, ఇప్పటి తమ తీర్పునకు అనుగుణంగా సవరణలు తీసుకురావల్సిందే అని ధర్మాసనం తెలిపింది. కులాల వారిగా ఖైదీలకు పని ఇచ్చే మాన్యువల్ రాజ్యాంగ వ్యతిరేకం అవుతుందని, ఇది అమానుషం అని కూడా భావించాల్సి ఉంటుందని తెలిపారు. కిక్కిరిసి ఉన్న కోర్టు రూంలో ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది. జైళ్లలో కులాలవారిగా పనిని అప్పగిస్తున్నారని వచ్చిన వార్తలపై సుప్రీంకోర్టు తనంత తానుగా స్పందించింది. ఈ సుమోటో కేసును విచారించింది. దీనిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, రెండు మూడు నెలల్లో పరిస్థితిని సమీక్షించుకుని , తగు విధంగా స్పందించనున్నట్లు కూడా తెలిపారు. తమ తీర్పునకు సంబంధించి రాష్ట్రాలు తమ సమ్మతి నివేదికలు అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

స్టేట్ ప్రిజన్ మాన్యువల్‌కు సంబంధించి కులవివక్షత ఉందనే ప్రజా వ్యాజ్యం కూడా తమ ముందుకు వచ్చిందని సిజెఐ తెలిపారు. బ్యారెక్‌ల లోపల కులాల వారిగా అడ్డుగోడులు, వివక్షతలా? ఇదేం పద్థతి అని కూడా ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. రాజ్యాంగ చట్టాలు సమానత, పౌరుల గౌరవ మర్యాదలను నిలబెట్టాల్సి ఉంటుందని చెపుతాయి. మరి వీటిని కాదనడం సరైన పద్ధతా అని ఆవేదన వ్యక్తం చేశారు. కుల మాన్యువల్‌పై వివరణ ఇచ్చుకోవాలని కేంద్రం , 11 రాష్ట్రాలకు ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News