Saturday, October 5, 2024

కెటిఆర్‌తో ఆమెది పదేళ్ల పగ

- Advertisement -
- Advertisement -

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. దేవాదాయ, అటవీ శాఖా మంత్రి కొండా సురేఖ మధ్య పదేళ్లుగా పగ రగులుతున్నది. ఇద్దరు ఒకే పార్టీలో కొనసాగినప్పటికీ ఉప్పు, నిప్పుగా ఉన్నారు. ఐదేళ్లపాటు బిఆర్‌ఎస్ లో ఎమ్మెల్యేగా కొండా సురేఖ ఉన్నప్పటికీ కేటీఆర్ తో ఎడమొహం, పెడమొహంగా మెలిగారు. అదే సమయంలో బీఆర్‌ఎస్ ట్రబుల్ షూటర్ హరీశ్ రావు తో సన్నిహిత సంబంధాలు నెరిపారు. తమను రాజకీయంగా కేటీఆర్ దెబ్బతీసారనే భావనలో కొండా ఫ్యామిలీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అరంగ్రేటం చేసిన సురేఖ..రాజకీయ అవసరాల రీత్యా వివిధ పార్టీల్లో చేరారు. అదే క్రమంలో 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఆర్‌ఎస్ లో చేరారు. రాజకీయ ఫైర్ బ్రాండ్ గా ఉన్న సురేఖకు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి అధిష్టానం టికెట్ ఇచ్చింది.

ఎన్నికల్లో మరోమారు ఎమ్మెల్యేగా సురేఖ గెలిచారు. అప్పటికే మంత్రి పదవి నిర్వహించి సీనియర్ గా ఉన్న సురేఖకు మళ్లీ పదవి దక్కుతుందని భావించారు. అయితే కేబినెట్ లో బెర్త్ దక్కకపోవడంతో నిరాశ చెందారు. 2014 నుంచి 2018 వరకు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగిన సురేఖ…కేటీఆర్ కు దూరంగా ఉన్నారు. మున్సిపల్ శాఖామంత్రి హోదాలో వరంగల్ తూర్పు పర్యటనకు వచ్చినపుడు కూడా స్థానిక ఎమ్మెల్యేగా సురేఖ హాజరుకాలేదు. అప్పట్లో ఆ అంశం పెద్ద దుమారాన్నే రేపింది. అప్పటినుంచి కేటీఆర్ కు సురేఖకు మధ్య మరింత గ్యాప్ పెరిగింది. అదే సమయంలో అప్పటి మరోమంత్రి హరీశ్ రావు జిల్లా పర్యటనలో ప్రముఖంగా ఉండేది. ఇదంతా ఇద్దరి మధ్య గ్యాప్ పెంచుతూ వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖకు టికెట్ నిరాకరించారు. దీంతో ఆమె అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. కేటీఆర్ టార్గెట్ గా విమర్శలు సంధించారు. చివరిదాకా టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు.

పార్టీని వీడుతూ కేటీఆర్ పై కొండా సురేఖ తీవ్ర కామెంట్స్ చేశారు. బిఆర్‌ఎస్ ను వీడి మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న పరకాల నుంచి 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. తమకు టికెట్ దక్కకపోవడానికి కారణం కేటీఆర్ అనే భావన కొండా ఫ్యామిలీలో బలంగా ఉన్నది. అవకాశం చిక్కినప్పుడల్లా కేటీఆర్ ను ఆమె టార్గెట్ చే స్తూనే ఉన్నారు. పదేళ్లుగా రగిలిపోతున్న సురేఖ…కాంగ్రెస్ ప్ర భుత్వం ఏర్పడగానే మరోమారు మంత్రి అయ్యారు. కేటీఆర్ పై ప గ తీర్చుకునే తరుణం కోసం వేచిచూసారు. పదేళ్లుగా కడుపు లో దాచుకున్న బాధను మంత్రి కొండా ట్రోలింగ్ అంశంతో కేటీఆర్ ను టార్గెట్ చేశారు.

సానుభూతి నుంచి సవాళ్ల దాకా
మెదక్ లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి సురేఖ మెడలో నూలు దండను స్థానిక ఎంపీ రఘునందన్ రావు వేయడాన్ని బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశాయి. ఈ ఘటనతో కన్నీటి పర్యంతమైన సురేఖ…కేటీఆర్ టార్గెట్ గా విమర్శలకు దిగింది. తొలుత మంత్రి సురేఖకు ఎనలేని సానుభూతి లభించినా తదుపరి పరిణామాలు సవాళ్లకు దారితీశాయి. సినీ పరిశ్రమకు చెందిన కుటుంబాల ప్రస్తావన రావడంతో సమస్య జటిలం అయింది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాష్ట్రంలో పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు సినీ వర్గాల నుంచి, మరోవైపు బిఆర్‌ఎస్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. మంత్రి సురేఖను బిఆర్‌ఎస్ చేసిన ట్రోలింగ్ అంశం మరుగునపడి సినీ పరిశ్రమ వివాదం తెరమీదకు వచ్చింది.

మంత్రి సురేఖ మెట్టు దిగినా
కేటీఆర్ టార్గెట్ గా మంత్రి సురేఖ చేసిన విమర్శల పరంపరలో సినీ పరిశ్రమపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. సినీ పరిశ్రమ నుంచి ప్రతిఘటన రావడంతో మంత్రి సురేఖ మెట్టు దిగారు. హీరోయిన్ సమంత ప్రకటన బాధించిందని, తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. తనపై చేసిన వ్యాఖ్యలకు 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ లీగల్ నోటీస్ పంపారు. లీగల్ గానే ఎదుర్కొంటానని సురేఖ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు సురేఖ మెట్టు దిగినా హీరో నాగార్జున మాత్రం నో అంటున్నారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన ఆయన కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఆందోళనలు
బిఆర్‌ఎస్ శ్రేణులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం కొనసాగుతున్నది. మంత్రి సురేఖకు మద్దతుగా కాంగ్రెస్, కేటీఆర్ కు మద్దతుగా బిఆర్‌ఎస్ తెగ హడావిడి చేస్తున్నది. మరోవైపు సినీ నటుడు నాగార్జున అభిమాన సంఘాలు కూడా ఆందోళన చేస్తూ సురేఖ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నది. ఆమె దిష్టిబొమ్మలను దగ్ధం చేసింది. కొండా సురేఖ, కేటీఆర్ మధ్య రాజకీయ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారి సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News