Saturday, October 5, 2024

గౌరవనీయ జీవన హక్కు నిర్బంధితులకూ వర్తిస్తుంది

- Advertisement -
- Advertisement -

శారీరక శ్రమలో కుల ఆధారిత వివక్షపై నిషేధం
సంచార తెగల ఖైదీలపై వివక్ష తగదు
సుప్రీం కోర్టు మైలురాయి తీర్పు

న్యూఢిల్లీ : గౌరవంగా జీవించే హక్కు నిర్బంధితులకూ వర్తిస్తుందని, దానిని ఖైదీలకు లేకుండా చేయడం ‘వలస పాలకుల, వలసవాదానికి ముందు వ్యవస్థల జ్ఞాపకచిహ్నం’ అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పర్దీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం గురువారం వెలువరించిన ఒక మైలురాయి తీర్పులో ఆ వ్యాఖ్యలు చేసింది. సంచార లేదా పాక్షిక తెగలు, ఘరానా నేరస్థుల పట్ల శారీరక శ్రమ విభజన, బ్యారక్‌ల వేర్పాటు, పక్షపాతం ప్రదర్శన వంటి కుల ఆధారిత వివక్షను బెంచ్ ఆ తీర్పు ద్వారా నిషేధించింది. ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, కేరళ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ సహా పది రాష్ట్రాలకు చెందిన కొన్ని అభ్యంతరకర జైలు మ్యాన్యువల్ నిబంధనలను రాజ్యాంగవిర్ధుమైనవిగా బెంచ్ ప్రకటించింది.

బెంచ్ తరఫున 148 పేజీల తీర్పును సిజెఐ రాస్తూ, రాజ్యాంగంలోని అధికరణాలు 14 (సమానత్వం), 15 (వివక్ష నిషేధం), 17 (అస్పృశ్యత రద్దు), 21 (జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ), 23 (నిర్బంధ శ్రమకు వ్యతిరేకంగా హక్కు) కింద ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావించారు. అధికరణం 21 గురించి బెంచ్ ప్రస్తావిస్తూ, ‘గౌరవంతో జీవించే హక్కు తుదకు నిర్బంధితులకూ వర్తిస్తుంది. ఖైదీలకు గౌరవం ఇవ్వకపోవడం వలసపాలకుల, వలసవాదానికి ముందు వ్యవస్థల జ్ఞాపక చిహ్నం, ప్రభుత్వం అజమాయిషీ కింద అమానవీయంగా, అవమానకరంగా వ్యవహరించేందుకు అణచివేత విధానాలను రూపొందించారు’ అని పేర్కొన్నది. రాజ్యాంగం ముందు కాలపు నిరంకుశ ప్రభుత్వాలు జైళ్లను నిర్బంధ ప్రదేశాలుగానే కాకుండా ఆధిపత్య సాధనాలుగా కూడా చూశాయి. రాజ్యాంగం తీసుకువచ్చిన మార్పుతో చట్టబద్ధ వ్యవస్థపై దృష్టి కేంద్రీకరిస్తూ తుదకు ఖైదీలు కూడా గౌరవంతో జీవించే హక్కులు అర్హులుని ఈ కోర్టు గుర్తించింది’ అని బెంచ్ తెలిపింది.

అధికరణం 14 గురించి బెంచ్ ప్రస్తావిస్తూ, భారత భూభాగంలో ఏ వ్యక్తికీ చట్టం ముందు సమానత్వాన్ని లేదా చట్టాల కింద సమాన రక్షణను లేకుండా చేయరాదని స్పష్టం చేసింది. కులం, జాతి, మతం, భాష మొదలైనవాటి ఆధారంగా వివక్షను నిషేధిస్తున్న అధికరణం 15 గురించి కూడా బెంచ్ తన తీర్పులో ప్రస్తావించింది. ‘ప్రభుత్వం పైన పేర్కొన్న కారణాల కింద ఒక పౌరునిపై వివక్ష ప్రదర్శించడం అత్యున్నత స్థాయి వివక్ష అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం బాధ్యత వివక్షను నివారించడమే కాని పాటించడం కాడు. అందుకే ఏ పౌరునిపైనా వివక్ష చూపకుండా ప్రభుత్వాన్ని మన రాజ్యాంగం నిషేధిస్తున్నది’ అని బెంచ్ వివరించింది. అంటరానితనాన్ని నిషేధించిన అధికరణం 17 గురించి బెంచ్ ప్రస్తావిస్తూ, ఆ విధానాన్ని రద్దు చేయడమైందని, దానిని ఏ రూపంలోనూ పాటించరాదని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News