Saturday, October 5, 2024

జిహెచ్‌ఎంసి పరిధిలో నలుగురు మేయర్లు

- Advertisement -
- Advertisement -

మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం రెండు నెలల్లో ఆర్‌ఆర్‌ఆర్‌కు టెండర్లు
సబర్మతి నది స్ఫూర్తితోనే మూసీ సుందరీకరణ : మంత్రి కోమటిరెడ్డి

ఎన్నికలకు వెళ్లే అంశం పరిశీలిస్తున్నాం
మరో రెండు నెలల్లో రీజనల్ రింగ్‌రోడ్డుకు టెండర్లు పిలుస్తాం
రోడ్లు, ఆర్‌ఓబిలు, ఆర్‌యూబిలు, కొత్త లింక్ రోడ్లు నిర్మిస్తున్నాం
హైదరాబాద్ అభివృద్ధి కోసం బడ్జెట్ లో రూ.10,000 కోట్లు కేటాయించాం
అర్భన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2024లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్:  మహానగర జనాభా కోటిన్నర దాటిందని అందులో భాగంగానే జీహెచ్‌ఎంసిని నలుగురు మేయర్లుగా విభజించి ఎన్నికలకు వెళ్లే అంశం పరిశీలిస్తున్నామని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. హెచ్‌ఐసిసి, నోవాటెల్‌లో అసోచామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్భన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2024కు కోమటిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రీజనల్ రింగ్‌రోడ్డుతో మహానగర రూపురేఖలు మారిపోతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దాదాపు రూ.30వేల కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు కేంద్రం సాయం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. మరో రెండు నెలల్లో రీజనల్ రింగ్‌రోడ్డుకు టెండర్లు పిలుస్తామని ఆయన తెలిపారు. మూసీ సుందరీకరణకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసిందని, దీనివల్ల రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లావాసులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

ఎన్ని ఆటంకాలు ఎదురైనా మూసీ ప్రక్షాళన చేస్తాం

ఎన్ని ఆటంకాలు ఎదురైనా మూసీ ప్రక్షాళన పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రప్రగతికి అడ్డుపడే రాజకీయాలు ప్రజలకు నష్టం చేస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నో పరిశ్రమల నుంచి రసాయనాలతో పాటు మురికినీరంతా మూసీలోకే వస్తుందని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్ని ఆటంకాలు ఎదురైనా మూసీ సుందరీకరణ పూర్తి చేసి తీరుతామని కోమటిరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే మూసీనది ఆక్రమణలపై మార్కింగ్ చేశారని, తాము మరింత ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షంలో ఉన్న బిఆర్‌ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం రాద్దాంతం చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తమ మంత్రివర్గం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలిసి మూసీనది ప్రక్షాళనకు కీలక నిర్ణయం తీసుకుందన్నారు. మూసీ కంటే విషపూరితమైన సబర్మతిని ప్రక్షాళన చేసి మంచినీరు ప్రవహించే విధంగా మార్చారన్నారు. నమామి గంగ పేరిట సబర్మతి నదిని వాళ్లు క్లీన్ చేసినప్పుడు మనమెందుకు మూసీ సుందరీకరణ చేపట్టకూడదన్న ఆలోచన చేశామన్నారు. ఇదే అంశంపై గతంలో బిఆర్‌ఎస్ మార్కింగ్ కూడా చేశామని, కానీ, ఇప్పుడు దానిపై రాద్దాంతం చేసి రాజకీయంగా ఎదగాలని చూస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రంలో పట్టణీకరణ జరగాల్సిన ఆవశ్యకత ఉంది….

మూసీని ప్రక్షాళన చేస్తామని జైకా నుంచి వెయ్యి కోట్లు రుణం తీసుకున్న బిఆర్‌ఎస్ నాయకులు అధికారం పోగానే మూసీ ప్రక్షాళన వద్దని గగ్గోలు పెడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే రాజకీయాలు తగదని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు. ప్రతిపక్ష పార్టీల ద్వంద్వ విధానాలపై ఆయన మండిపడ్డారు. స్థిరమైన మౌలిక వసతుల నిర్మాణం, రాష్ట్ర సుస్థిరాభివృద్ధి కోసం ప్రగతిశీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని గత పదేండ్ల తెలంగాణ విధ్వంసాన్ని సరిదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తూ సమ్మిళిత, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలవైపు సాగుతున్నామని మంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న అర్భన్ కల్చర్‌కు అనుగుణంగా తెలంగాణలో పట్టణీకరణ జరగాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

2028 నాటికి ఓఆర్‌ఆర్ పరిధిలో 50 శాతం జనాభా

దానికోసం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు, అభివృద్ధికి బలమైన పునాదులు వేయడంతో పాటు రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేసేందుకు అనేక మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆయన వివరించారు. హైదరాబాద్ దశా-దిశను మార్చేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని మంత్రి చెప్పారు. అందులో భాగంగానే రోడ్లు, ఆర్‌ఓబిలు, ఆర్‌యూబిలు, కొత్త లింక్ రోడ్లు నిర్మించడం వంటి కీలకమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. అంతేకాకుండా అర్భన్ ఏరియాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ సవాల్ తో కూడుకుందని మంత్రి తెలిపారు.

అందుకోసం ఎస్‌టిపిలను నిర్మించి మెరుగైన మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఓఆర్‌ఆర్ పరిధిలో దాదాపు 40 శాతం జనాభా నివసిస్తుందని ఇది 2028 నాటికి 50 శాతం దాటే అవకాశం ఉందని దానికి అనుగుణంగా హైదరాబాద్‌లో పట్టణ విస్తరణ, మౌలిక వసతులను కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. దేశంలో పరిమితమైన ప్రాంతంలో అపరిమితమైన ఫ్లోర్ స్పేస్ అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. అగ్నిమాపక వ్యవస్థ, ట్రాఫిక్ నియంత్రణ, మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనవంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు.

19 ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తాం

రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేసేందుకు స్పీడ్ (స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫీషీయంట్, ఎఫెక్టివ్ డెలివరీ) వంటి ప్రణాళికలతో 19 ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తిచేసేందుకు ముందుకు సాగుతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. అందులో భాగంగానే, మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి, కొత్త విమానాశ్రయాల నిర్మాణం, శాటిలైట్ టౌన్‌షిప్‌ల ఏర్పాటు, మెట్రో విస్తరణ, జిహెచ్‌ఎంసి పునర్వ్యవస్థీకరణ, సికింద్రాబాద్, ఇతర నగరాల్లో ఎలివేటెడ్ కారిడార్లు, రీజినల్ రింగ్ రోడ్, హైకోర్టు భవన నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్, ఉస్మానియా నూతన భవన నిర్మాణం వంటి ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా హైకోర్టు భవనంలో పిపిపి పద్ధతిలో మోడల్‌లో పార్కింగ్ నిర్మించే అంశంపై ఆలోచన చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

హైదరాబాద్ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ లో రూ.10,000 కోట్లు కేటాయించడమే కాకుండా ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా మార్చడానికి అనేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పర్యావరణ సుస్థిరతను మెరుగుపరచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్‌తో కలిసి నెట్ జీరో ఎమిషన్స్ లక్ష్యంగా కృషి చేయడంతో పాటు యువతను స్కిల్ మ్యాన్ పవర్‌గా మార్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ కాన్సుల్ జనరల్ (ఛీఫ్ పొలిటికల్ అండ్ ఎకానమిక్ సెక్షన్), హైదరాబాద్ ఫ్రాంక్ పి టల్లూటో, ఫోనిక్స్ గ్రూప్ చైర్మన్ సురేష్ చుక్కపల్లి, అలార్డ్ యూనివర్సిటీ విసి డాక్టర్ పూనమ్ కశ్యప్, రాంబాబు బూరుగు, అసోచాం రాష్ట్ర ప్రతినిధి దినేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News